రాజ్యసభకు సుధా మూర్తి; ‘నారీ శక్తి’ అంటూ కితాబిచ్చిన ప్రధాని మోదీ
రచయిత్రి, స్వచ్చంధ సంస్థల ద్వారా కోట్ల రూపాయలను నిరుపేదలకు అందించడం ద్వారా సుధా మూర్తి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్యగా లోకానికి పరిచయమైనప్పటికీ… ఆమె సొంతంగా తనకు తాను ప్రజల జీవితాలపై ప్రభావం చూపించిన మహిళగా నిలిచారు. ఎందరికో స్ఫూర్తిగా ఆమె ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆమెలా ఉండాలని ఎందరో భావించేలా ఆమె నిర్ణయాలుంటాయి. సమాజ సేవకు గాను.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తిని అభినందిస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రకటన వెలువడింది.
ఆమె రాజ్యసభలో ఉండటం దేశ ‘నారీ శక్తి’కి శక్తివంతమైన నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. “భారత రాష్ట్రపతి @SmtSudhaMurty Jiని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధామూర్తి చేసిన కృషి అపారమైనది. స్ఫూర్తిదాయకం. రాజ్యసభలో ఆమె ఉనికి మనకు శక్తివంతమైన నిదర్శనం. ‘నారీ శక్తి’, మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో మహిళల శక్తి, సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుంది. ఆమెకు ఫలవంతమైన పార్లమెంటరీ పదవీకాలం కావాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు. భారత రాష్ట్రపతి 12 మంది సభ్యులను కళలు, సాహిత్యం, శాస్త్రాలు, సామాజిక సేవలకు చేసిన కృషికి పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేస్తారు.

