కర్ణాటకలో పోలింగ్‌లో మిన్నంటిన ఉద్రిక్తతలు, ఆందోళనలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు ఉదయం నుండి ప్రశాంతంగా సాగుతుండగా, హఠాత్తుగా హింసాత్మకంగా మారాయి. విజయపురజిల్లాలో పోలింగ్ కేంద్రంపై గ్రామస్తులు విరుచుకుపడ్డారు. ‘బస్వన్ బాగేవాడీ’ అనే నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ అధికారులు ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్ మారుస్తున్నారనే ఆరోపణలతో వీటిని ధ్వంసం చేస్తున్నారు గ్రామస్తులు. పోలింగ్ సిబ్బందిపై కూడా దాడి చేస్తున్నారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిపైన కూడా దాడికి పాల్పడుతున్నారు. ఎన్నికల సిబ్బంది కార్లను కూడా ధ్వంసం చేస్తున్నారు. గతంలో పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు గొడవలు పడుతుంటారు కానీ, ఇలా గ్రామస్తులు దాడి చేయడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు. దీనితో ఓట్లు వేయడానికి వచ్చిన వారు కూడా భయాందోళనలకు లోనయ్యారు. ప్రస్తుతానికి కాసేపు ఆకేంద్రంలో ఎలక్షన్‌కు బ్రేక్ పడింది. చాలామంది ఓటర్లు వెనుదిరిగి వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో మళ్లీ ఎలక్షన్ జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. కొన్ని ఈవీఎంలు, వీవీప్యాడ్స్ రిజర్వులో ఉంటాయి. వీటిని తీసుకువస్తారా అనేది సస్పెన్సుగా మారింది. ఎలక్షన్ కమీషన్ ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంది. ఆందోళన కారులను చెదరగొట్టే పనిలో పడ్డారు పోలీసులు.గ్రామస్తులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.

