Breaking NewsHome Page SliderInternationalNewsPoliticsviral

రష్యాపై రెండో విడత ఆంక్షలకు వ్యూహం

ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. “పుతిన్‌ను శిక్షించడానికి రెండో దశ ఆంక్షలకు సిద్ధంగా ఉన్నారా?” అని విలేఖరి అడిగిన ప్రశ్నకు “అవును, నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయన సమాధానం ఇచ్చారు. వైట్ హౌస్‌ రోజ్ గార్డెన్‌లో కాంగ్రెస్ సభ్యులతో జరిగిన విందులో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కూడా రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి అవసరమని పేర్కొన్నారు. “రష్యా తన యుద్ధాన్ని ముగించేందుకు ఆర్థిక దెబ్బ తీసేందుకు వెనకడుగు వేయబోమని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిలిపేందుకు మేము రెండో విడత సుంకాలకు సిద్ధమవుతున్నాం” అని అన్నారు. ట్రంప్ మాట్లాడుతూ, “ఏడు నెలల్లో మేం ఏడు యుద్ధాలను ఆపగలిగాం. కానీ నేను సులభంగా ముగుస్తుందని భావించిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే అత్యంత కఠినమైంది. పుతిన్‌తో నా వ్యక్తిగత సంబంధాలు ఉండటంతో ఇది సులభంగా పరిష్కారమవుతుందని అనుకున్నాను. ఇది నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన యుద్ధంగా మారింది” అని వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ముగిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రష్యా, భారతదేశాన్ని అమెరికా కోల్పోయిందని వ్యాఖ్యానించిన ఆయన, కొన్ని గంటలకే “అమెరికా-భారత్ సంబంధం చాలా ప్రత్యేకమైనది. నేను ప్రధాని మోదీ ఎల్లప్పుడూ స్నేహితులమే” అంటూ మోదీ గొప్ప ప్రధాని అంటూ కితాబిచ్చారు.
రష్యా చమురు కొనుగోలు దేశాలపై కొత్త సుంకాలు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై మరిన్ని సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ కూడా తమతో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారత్‌పై అదనంగా 25% సుంకాలు విధించగా, మొత్తం 50%కు చేరుకుని అధిక భారం మోపారు. రష్యా చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ పరోక్షంగా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ ఆరోపణలను ఖండించారు. “యూరోపియన్ దేశాలు రష్యా , భారత దేశం కంటే ఎక్కువ వాణిజ్యం చేస్తున్నాయి. 1.4 బిలియన్ ప్రజల ఇంధన భద్రత దృష్ట్యా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.