Home Page SliderNational

రాజస్థాన్ నుండి రాజ్యసభ ఎన్నికలకు సోనియా గాంధీ నామినేషన్

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికలకు బుధవారం నామినేషన్ దాఖలు చేస్తారు. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా పనిచేసిన తర్వాత 77 ఏళ్ల సోనియా, రాజ్యసభలోకి ప్రవేశించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఆమెతోపాటు జైపూర్‌కు వెళ్లి పత్రాలను దాఖలు చేయనున్నారు. లోక్‌సభకు రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్న సోనియా, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1999లో తొలిసారిగా ఎన్నికయ్యారు.

15 రాష్ట్రాలకు చెందిన మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఫిబ్రవరి 27న స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ. రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం సునాయాసమే. ఏప్రిల్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరేళ్ల పదవీకాలం పూర్తికావడంతో ఈ స్థానం ఖాళీ కానుంది. ఆగస్టు 1964 నుండి ఫిబ్రవరి 1967 వరకు ఎగువ సభలో సభ్యునిగా ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రాజ్యసభలో ప్రవేశించిన గాంధీ కుటుంబంలో రెండో సభ్యురాలు సోనియా.

ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు ఎవరి పేర్లు ప్రకటించలేదు. 2019లో తన చివరి లోక్‌సభ ఎన్నికలవుతాయని సోనియా ప్రకటించారు. సోనియా గాంధీ రాజ్యసభకు పోటీ చేస్తోండటంతో… ఈసారి రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోనియా గాంధీ రాజస్థాన్ నుండి పోటీ చేయడానికి సిద్ధమైనప్పటికీ… తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో అవకాశం ఉన్నప్పటికీ ఆమె రాజస్థాన్ ఎంచుకున్నారు. కాంగ్రెస్ కుటుంబం హిందీ-హార్ట్ ల్యాండ్ వదలరాదన్న నిర్ణయంతో సోనియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.