అమ్మ మాట వేదవాక్కు, మెట్టుదిగిన డీకే శివకుమార్
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రంగ ప్రవేశం చేయడంతో కర్నాటక కీలక నేత డీకే శివకుమార్ పంతం వీడారు. సీఎం పీఠం ఇచ్చే వరకు వెనక్కి తగ్గబోనన్న డీకే, చివరకు అమ్మ చెప్పడంతో మాట కాదనలేకపోయారు. ఉపముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు ససేమిరా చెప్పిన డీకే, సోనియా మాటను కాదనలేకపోయారు. సోనియా ఆదేశాన్ని శిరసా పాటిస్తానన్నారు. పార్టీ ముఖ్యలందరూ కూడా సిద్ధరామయ్యను సీఎంగా, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. సీఎం పీఠం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ శివకుమార్ భీష్మించుకు కూర్చోవడంతో పార్టీ నేతలు, ఆయనను ఒప్పించే బాధ్యతను సోనియాకు అప్పగించారు.

ఇన్నాళ్లూ తాను పార్టీ కోసమే కష్టపడ్డానన్న డీకే, ఇప్పుడు కూడా పార్టీ కోసమే తాను సీఎం పదవిని త్యాగం చేయడానికి సిద్ధమని కాంగ్రెస్ ముఖ్యలకు తేల్చి చెప్పారు. బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత దీనిపై ప్రకటన విడుదల కానుంది. సిద్ధరామయ్యను మెజార్టీ ఎమ్మెల్యేలు మరోసారి సీఎంగా చూడాలని కోరుకోవడంతో, కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆ నిర్ణయానికే ఆమోదం తెలిపింది. అంతకు ముందు ఇద్దరు నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. తమకు సీఎం పీఠం కావాల్సిందేనని పట్టుబట్టారు.
