వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ఆత్మహత్య
ఏపీ ప్రభుత్వ విప్ అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథ రెడ్డి(34) ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్ 101వ నంబర్ ఫ్లాటు లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంజునాథ రెడ్డి అప్పుడప్పుడూ ఈ ఫ్లాటుకు వచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్తుంటారని స్ధానికులు చెబుతున్నారు. మూడు రోజుల కిందట అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఆయన నిన్న బలవన్మరణానికి పాల్పడ్డారు.

మంజునాథ రెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హలనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారి పల్లె. ఆయన తండ్రి మహేశ్వర్ రెడ్డి. వైసీపీ నాయకుడు, పీఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత. కుమారుడి మరణ వార్త తెలుసుకుని అయన హుటాహుటిన విజయవాడకు బయల్దేరారు. మంజునాథ రెడ్డి మృతిపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. చివరికి పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. మంజునాథ రెడ్డి రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. రెడ్డి అండ్ రెడ్డి కంపెనీ నిర్వహిస్తున్నారు. మంజునాథ రెడ్డి భార్య స్రవంతి వైద్యురాలు.
బిల్లులు అందక ఒత్తిడితో..
‘కాశ్మీర్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో చేసిన కొన్ని పనులకు సంబంధించి రాంకీ సంస్థ నుంచి తమ కంపెనీకి బిల్లులు రావాల్సి ఉందని. మరోవైపు బ్యాంకుల నుంచి సకాలంలో ఫైనాన్స్ అందలేదని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వెళ్లడించారు. సాయంత్రం సమయంలో చనిపోయినట్లు తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే విజయవాడకు బయలుదేరామని వివరించారు. ఆయన స్వగ్రామం పప్పిరెడ్డిగారిపల్లెలో విషాదం అలుముకుంది. మంజునాథ రెడ్డి మృతదేహం ప్రస్తుతం మణిపాల్ హాస్పటల్ లో ఉంది.