Breaking Newshome page sliderHome Page SliderNationalNewsNews Alertviral

ఏడుగురు విద్యార్థులు మృతి .. ఐదుగురు టీచర్ల సస్పెన్షన్

రాజస్థాన్‌లోని ఝలావార్ జిల్లా పింప్లోడ్‌లో శుక్రవారం జరిగిన దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల భవనం కూలిపోవడంతో ఏడుగురు అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, పదకొండు మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు ముందు విద్యార్థులు ‘‘పైకప్పు నుంచి రాళ్లు రాలుతున్నాయని’’ ఉపాధ్యాయులను హెచ్చరించినప్పటికీ, వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం ఈ విషాదానికి ప్రధాన కారణమైంది. పై నుంచి రాళ్లు రాలుతున్నాయని మేము టీచర్లకు చెప్పాం. కానీ వారు మమ్మల్ని తిట్టి, తరగతి గదిలో కూర్చోమన్నారు. ఆ సమయంలో గోడ కూలిపోయి, పైకప్పు విద్యార్థులపై పడింది” అని ప్రమాదం నుంచి బయటపడిన ఎనిమిదవ తరగతి విద్యార్థి ఒకరు కన్నీళ్లతో వివరించాడు. ఇది ఉపాధ్యాయుల ఘోర నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పాఠశాల గోడలు, పైకప్పు శిథిలావస్థలో ఉన్నాయని స్థానికులు గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. నెల రోజుల క్రితం సిమెంట్, ప్లాస్టరింగ్‌తో పైపై మరమ్మతులు చేసినట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్:

ఈ దుర్ఘటన తర్వాత ఝలావార్ జిల్లా కలెక్టర్ అజయ్ సింగ్ రాథోడ్ తక్షణమే స్పందించి ఐదుగురు ఉపాధ్యాయులు సహా విద్యా శాఖ అధికారులను నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ చేశారు. “శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల్లో విద్యార్థులను కూర్చోబెట్టవద్దని జూన్‌లోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఈ ఘటనలో స్పష్టమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేశాం, దాని నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం” అని రాథోడ్ తెలిపారు.

రాజస్థాన్ రాజకీయాల్లోనూ ప్రకంపనలు :

ఈ విషాదం రాజస్థాన్ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఈ ఘటనను “అత్యంత బాధాకరం”గా అభివర్ణించారు. “పింప్లోడ్ పాఠశాల దుర్ఘటనలో పిల్లల మృతి, గాయాలు హృదయ విదారకం” అని ఆమె అన్నారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి రాష్ట్రంలో వేల స్కూళ్లు శిథిలావస్థలో ఉన్నాయని చేసిన వ్యాఖ్యలపై పైలట్ మండిపడ్డారు.