వందేళ్ల నాటి భారీ వృక్షం కూలి ఏడుగురు మృతి
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలోని బాబూజీ మహరాజ్ ఆలయంలో ఓ విషాదం చోటుచేసుకుంది. ఈ ఆలయప్రాంగణంలో ఓ భారీవృక్షం కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులు కారణంగా ఈ ప్రాంగణంలోని 100 ఏళ్ల క్రితం నాటి భారీ వేపచెట్టు నేలకూలింది. ఇది సమీపంలోని రేకుల షెడ్‌పై పడడంతో దానికింద భక్తులు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు శిథిలాల క్రింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి, వృక్షాన్ని తొలగించారు. ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. ఆయా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

