ఉగ్రదాడిలో సంచలన విషయాలు..
పహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఉగ్రవాదులు టూరిస్టుల ఐడీ కార్డులను చెక్ చేసి, షూట్ చేశారు. మృతులలో అత్యధికులు ఐబీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన అధికారులే. వారి కుటుంబాలను వదిలేసి, వారిని టార్గెట్ చేసి అతి దగ్గర నుండి షూట్ చేయడంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. దీనితో ప్రభుత్వాధికారులను, వారి కుటుంబసభ్యులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రాంతానికి మోటార్ వెహికల్స్ అనుమతించకపోవడంతో ఉగ్రవాదుల పని మరింత సులువయ్యింది. సహాయక చర్యలకు కూడా కష్టమయ్యింది. ఈ బైసరన్ లోయలో ఐదు కిలోమీటర్ల పాటు కాలినడకన లేదంటే పోనీలపై పర్యాటకులు రావాల్సి ఉంటుంది. తన భర్తను చంపిన ఉగ్రవాదితో ఒక మహిళ తనను, తన బిడ్డను కూడా చంపమని వేడుకోవడం కంటతడి పెట్టిస్తోంది. ‘మిమ్మల్ని చంపం. పోయి మోదీకి చెప్పుకోండి..’ అంటూ ఉగ్రవాది బదులిచ్చినట్లు ఆమె పేర్కొంది. ఆరుగురు ఉగ్రవాదులు సైనికుల దుస్తులతో ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనితో నిజంగా సహాయం కోసం వచ్చిన భారత సైన్యాన్ని చూసినా కూడా పర్యాటకులు భయంతో వణికిపోతున్నారు.

