సిగాచి ప్రమాదంలో …వెలుగులోకి సంచలన నిజాలు..
పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమ పేలుడు ఘటనపై వెలుగులోకి వచ్చిన తాజా వివరాలు పరిశ్రమలో సాగుతున్న నిర్లక్ష్యాన్ని బట్టబయలుచేశాయి. జూన్ 30న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలో చోటు చేసుకున్న ఈ భారీ ప్రమాదంలో 40 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్‌లోని రియాక్టర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, ఫ్యాక్టరీలో పాత మెషినరీ వాడటం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని తేలింది. అగ్నిమాపక బృందం కూడా లోపలికి వెళ్లేందుకు తగిన మార్గాలు లేవని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కార్మికులు గతంలో అనేకసార్లు తమ ఆందోళనలను యాజమాన్యానికి తెలిపినప్పటికీ, నిర్లక్ష్యం వహించినట్టు సమాచారం. పేలుడు ధాటికి మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దాదాపు 100 మందికి పైగా కార్మికులు ఘటన సమయంలో అక్కడ ఉన్నారు. మృతుల్లో బీహార్, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. అనేక మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో DNA పరీక్షలు జరుగుతున్నాయి. 35 మందికి పైగా గాయపడ్డారు, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి సహాయ నిధి ద్వారా నష్టపరిహారం ప్రకటించగా, సిగాచి సంస్థ కూడా ఒక్కో కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం ప్రకటించింది. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణను ప్రకటించింది. ఈ ఘోర ఘటన పారిశ్రామిక భద్రతపై ప్రశ్నలు రేపుతూ, కఠిన నిబంధనల అమలుపై డిమాండ్‌లకు దారితీసింది.

