వైసీపీలో వర్గ విభేదాలు.. ప్రతిపక్షానికి తాడికొండ వరం కాబోతుందా?
జగన్ అనుసరిస్తున్న వైఖరితో గుంటూరు జిల్లాలోని కీలకమైన తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నియోజకవర్గానికి తాజాగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితను వైసీపీ నియమించింది. ఆమెకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని తేల్చేసింది. అయితే ఈమె ఇంకా రంగంలోకి దిగలేదు. సుచిరత వచ్చినా.. జెండా పట్టుకునేవారు.. జైకొట్టేవారు లేరన్నది లోకల్ టాక్. ఆమె ఇక్క డ కొత్త నాయకురాలు కావడం… పైగా ఈ సీటుపై ఇద్దరు నాయకులు ఆశలు పెట్టుకోవడం కూడా కారణమంటున్నారు. దీంతో వారు మేకతోటి సుచరితకు సహకరించడం కష్టమేనన్న భావన ఉంది.

ప్రస్తుత ఎమ్మెల్యే, 2019లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న ఉండవల్లి శ్రీదేవిని తప్పించిన తర్వాత తాడికొండ వైసీపీలో మరింత వివాదం చోటు చేసుకుంది. నిజానికి శ్రీదేవిని పక్కన పెట్టాలని ముందుగానే ఒక అంచనాకు వచ్చిన వైసీపీ, ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులను కూడా పెద్ద ఎత్తున ఆకర్షించారు. మండల స్థాయిలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు అనుభవం ఉండటంతో చాలా మంది ఆయనకు సహకరించారు.

ఇంతలోనే డిప్యూటీ ఇంచార్జ్‌గా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా భర్త కత్తెర సురేష్‌కు బాధ్యతలు అప్పగించడంతో రచ్చకు కారణమైంది. దీంతో ఆయన కూడా తనకే టికెట్ ఇస్తారని అనుకుని భారీ ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పైగా అటు డొక్కా, ఇటు సురేష్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో వీరిలో ఎవరికి ఇచ్చినా సర్దుకుపోవాలని కూడా నిర్ణయించుకున్న సమయంలో సుచిరతకు సీటు ఇచ్చి జగన్ ట్విస్ట్ ఇచ్చారు. మొత్తంగా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఎలా నెగ్గుకురాగలన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ సీటు ప్రతిపక్షానికి వరం కాబోతుందని విశ్లేషణలు విన్పిస్తున్నాయి.