238 మంది చిన్నారులను రక్షించిన ఆర్పీఎఫ్..
సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మానవ అక్రమ రవాణాపై పోరాటంలో దూకుడు పెంచింది. ఈ ఏడాది ఇప్పటివరకు 238 మంది పిల్లలను రక్షించి, 69 మంది అక్రమ రవాణాదారులను అరెస్టు చేసింది. “ఆపరేషన్ AAHT”లో భాగంగా, RPF యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ (AHTU) మరియు బచ్‌పన్ బచావో ఆందోళన్ (BBA)తో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. ఛత్తీస్‌గఢ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుండి అక్రమ రవాణా చేయబడిన పిల్లలు ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు.
గత రెండేళ్లలో (2023, 2024) రక్షించిన పిల్లలు, అరెస్టు చేసిన అక్రమ రవాణాదారుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి రక్షించిన పిల్లల సంఖ్య 400కు చేరుకోవచ్చని అంచనా.
రక్షించిన పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు హాజరుపరుస్తున్నారు. రైల్వే నెట్‌వర్క్‌ల నుండి మానవ అక్రమ రవాణాను నిర్మూలించడమే తమ లక్ష్యమని, అనుమానాస్పద కార్యకలాపాలను హెల్ప్‌లైన్ నంబర్ 139 కు తెలియజేయాలని RPF ప్రజలకు విజ్ఞప్తి చేసింది.