Home Page SliderTelangana

నువ్వా-నేనా.. తెలంగాణలో వాటర్ వార్ వెనుక రాజకీయం

తెలంగాణలో మరోసారి అగ్గిరాజుకుంటుంది. గత ఎన్నికల్లో కేసీఆర్ సర్కారు ఓటమి తర్వాత తెలంగాణలో తొలిసారి నీటి యుద్ధం అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల దూకుడుకు కారణమవుతోంది. తెలంగాణ ఎవరి కోసమైతే ఏర్పడిందో తెలంగాణ ఎందుకోసమైతే ఏర్పడిందో ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్లుగా పాలన సాగించామని ఇన్నాళ్లూ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంటే.. అసలు బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ఆగమాగమైందంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది. కేసీఆర్ పాలన అంతా డొల్ల అని… పైన పటారం లోన లోటారం అన్నట్టుగా సాగిందని, అవినీతి కంపుకొడుతోందని.. సాగు ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణకు భారంగా మారాయంటూ అధికార కాంగ్రెస్ మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెలన్నరలోనే… తెలంగాణకు అన్యాయం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో ఉద్యమబావుటా ఎగురవేస్తోంది.

తెలంగాణ ప్రాజెక్టులను కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB)కు అప్పగించిందంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. కృష్ణా జలాల వినియోగం ఇక రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉండదగని.. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్లేనంటూ ఆ పార్టీ విమర్శిస్తోంది. అందుకే తాము తెలంగాణ కోసం ఉద్యమబాట పట్టామని బీఆర్ఎస్ చెబుతోంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేతగాని తనాన్ని వివరిస్తామంటోంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను కట్టబెట్టి.. ఇదంతా తమపైనే నెపం వేసేలా వ్యవహారం ఉందని ఆ పార్టీ ఆక్షేపిస్తోంది. అందుకే అనారోగ్యంతో ఉన్నప్పటికీ… మాజీ సీఎం కేసీఆర్ ఇందుకు నాయకత్వం వహిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ వచ్చిందని.. పదేళ్ల పాలన కూడా వాటి చుట్టూనే తిరిగిందని.. ఇప్పుడు నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊర్కోమని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. మొత్తంగా గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి కేసీఆర్ నోరు విప్పబోతున్నారు. కాంగ్రెస్ పార్టీపై మొదటిసారిగా కేసీఆర్ విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం కనిపిస్తోంది.

ఓవైపు బీఆర్ఎస్ పార్టీ దూకుడుకు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పదేళ్లుగా కేసీఆర్ సాగించిన పాలనలోని లోపాలను అడుగడుగునా ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ సైతం వడివడిగా సిద్ధమవుతోంది. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీని, అధినేత కేసీఆర్‌ను కార్నర్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు… అందివచ్చిన ఏ అవకాశాన్ని జారవిడువరాదని భావిస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. ప్రాజెక్టుల నిర్మాణంలో ఏం జరిగిందో వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ సభకు వస్తే… ఎమ్మెల్యేలకు, ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. తాజాగా కూలిపోతున్న మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వాస్తవాలు తెలియాలంటే సీఎం కేసీఆర్ కూడా అక్కడకు వచ్చి.. ఎమ్మెల్యేలకు అన్ని విషయాలను వివరించాలని కోరారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలని రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ మేడిగడ్డకు వస్తానంటే హెలికాఫ్టర్ సైతం సిద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్న భావనను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోంది కాబట్టే.. ఇంకా మొత్తం వ్యవహారంపై విచారణను సాగిస్తోందని, లేదంటే మరోలా ఉండేదని మంత్రులు సభ సాక్షిగా వెల్లడించారు. ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో ఓ బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి అంచనాలు పెంచేసి కేసీఆర్ దండుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కుంగిన ప్రాజెక్టును రిపేర్ చేయకుండా… గత ప్రభుత్వం దాచిపెట్టిందని.. అటువైపు ఎవరూ కూడా వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. నిర్మాణ ఫైళ్లు లభించకుండా, విజిలెన్స్ విచారణకు అడ్డొస్తున్నారని ఆక్షేపించారు. డాక్యుమెంట్లను మాయం చేసిందని, విజిలెన్స్ విచారణకు జరక్కుండా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీలో భారీ అవినీతి జరిగిందని వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని మంత్రులు సభ సాక్షిగా బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలుగుప్పించారు. సభలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ తప్పిదాలు తెలంగాణ పాలిట శాపలయ్యాయని చెప్పారు. అప్పగింత ప్రక్రియ అంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని.. ఇప్పుడు ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతోందని ఉత్తమ్ ఆరోపించారు.

మరోవైపు నల్గొండ జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగిస్తోంది. తెలంగాణ ఇంటి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇన్నాళ్లూ.. తెలంగాణకు అన్యాయం జరక్కుండా కాపాడుకుంటూ వస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తెలంగాణకు అన్యాయం జరగడానికి కారణమవుతున్నాయని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేలా బీఆర్ఎస్ పార్టీ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ కోణంలో ముందుకు తీసుకెళ్తోంది గులాబీ పార్టీ. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కౌంటర్ మీద కౌంటర్ ఇస్తోంది. అధికార పక్షం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న లోపాలు అన్నీ కూడా బీఆర్ఎస్ కారణమంటుంటే.. చర్చకు సిద్ధమా అంటూ హరీష్ సవాల్ విసురుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని కృష్ణ జలాల్లో తెలంగాణను ప్రయోజనాలను రేవంత్ రెడ్డి కాపాడుతుంటే కేసీఆర్ దెబ్బతిశారడం విడ్డూరమంటోంది ఆ పార్టీ. తెలంగాణకు 525 టీఎంసీలు అవసరం ఉంటే 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నారని… రాయలసీమకు సహకరించాలనే అందుకు అంగీకరించారని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడింది. ఐతే తెలంగాణకు కెఆర్ఎంబీ కేటాయించిన 299 టీఎంసీలను వ్యతిరేకిస్తూ 27 సార్లు లేఖలు రాసిన విషయాన్ని హరీష్ గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి కారణం ముమ్మాటికీ కేసీఆర్ అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ పెద్దలు విరుచుకుపడుతుంటే… ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించి.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు నష్టం చేస్తోందని హరీష్ ఆరోపించారు.

మొత్తంగా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లబ్ధిపొందేందుకు రాజకీయం చేస్తున్నారని, లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా రెండు పార్టీలు అడుగులు వేస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. కృష్ణా కేటాయింపులు, పంపిణీ విషయంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రెండు పార్టీలు తహతహలాడుతున్నాయని… గతంలో బీఆర్ఎస్ సర్కారు కేఆర్ఎంబీ నిర్వహణకు 200 కోట్లు కేటాయించిందని.. ఇప్పుడు ఇదే విషయమై ఆందోళన చేయడం విడ్డూరమని ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతియాడనికి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శించారు. అందుకే కేంద్రాన్ని దోషిగా చూపించాలని చూస్తున్నారని ఆక్షేపించారు. కేవలం రాజకీయంగా బెనిఫిట్ పొందాలన్న ఆలోచన తప్ప, తెలంగాణ ప్రాంతానికి మేలు చేయాలన్న యావ ఇద్దరికీ లేదని మండిపడ్డారు.

మొత్తంగా తెలంగాణలో నీటి యుద్ధానికి మూలం కేఆర్ఎంబీ యాజామన్య హక్కుల కేటాయింపు రూపంలో జరుగుతోంది. కానీ తెరపైకి కేఆర్ఎంబీ కన్పిస్తున్నప్పటికీ.. తెర వెనుక రాజకీయం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేసేందుకు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయ్. మొత్తంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన నీళ్ల అంశం ఇప్పుడు రాజకీయాలకు కారణమవుతోంది.