కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ సిద్ధం చేస్తామన్న రేవంత్ రెడ్డి
తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జనజాతర కార్యక్రమంలో అటు కేసీఆర్, ఇటు మోదీపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేశారన్నారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటా అని కేసీఆర్ అనుకుంటున్నారని… ఏం చేసినా చూస్తూ ఊరుకోడానికి తాను జానా రెడ్డిని కాదని, రేవంత్ రెడ్డినని చెప్పారు. ఎలా పడితే అలా మాట్లాడితే కేసీఆర్ ను జైల్లో పెడతామన్నారు. కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. కేసీఆర్ కు కాలు విరిగిందని, కూతురు జైలుకు వెళ్లిందని జాలి చూపించామన్నారు రేవంత్. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి నిధులు కావాలంటే 14 మంది ఎంపీలను గెలిపించాలన్నారు. 6 గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 9న దేశంలో మువ్వెన్నల జెండా రెపరెపలాడాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని తుక్కుతుక్కుగా ఓడించినట్టుగానే, బీజేపీని ఓడించాలన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలన్నారు. కార్యకర్తల కష్టం వల్ల రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. దేశంలో ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని మోదీ ఏం చేశారని రేవంత్ ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ పై వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం ప్రదర్శిస్తుందన్నారు. పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలివ్వాల్సి ఉంటగా కేవలం 7 లక్షల ఉద్యోగాలే ఇచ్చారన్నారు. నల్ల వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు 17 నెలలు పోరాడారన్నారు. 750 మంది రైతులు చనిపోతే ఒక్కర్ని కూడా మోదీ పరామర్శించలేదన్నారు.