తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
సకల చరాచర సృష్టికి జీవాన్ని, వేడిని, వెళుతురును అందించే ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు. అట్టి భగవానుని జన్మదినమైన రథసప్తమి వేడుకలను తిరుమలలో వైభవంగా నిర్వహిస్తారు. తిరుమల కొండలపై కొలువున్న కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని సూర్యమండలాధిదేవతగా భావిస్తూ చేసే ఈ ఉత్సవం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సప్తాశ్వరధమారూఢుడై లోకానికి నేడు దర్శనమిస్తారు సూర్యభగవానుడు. సప్తగిరీశ్వరుడిగా వేంకటేశ్వరుడు నేడు అన్ని వాహనాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున బ్రహ్మోత్సవాలలో మాడవీధులలో విహరించే అన్ని వాహన సేవలను నిర్వహిస్తారు. ఉదయం సూర్య ప్రభ వాహనంతో మొదలుపెట్టి, సాయం సమయంలో చంద్రోదయ వేళకు చంద్రప్రభ వాహనంతో ఈ వాహన సేవలు పూర్తవుతాయి. ఈ రోజున స్వామివారి వాహన సేవలు చూడడానికి రెండుకళ్లూ చాలవు. అందుకే లక్షల మంది భక్తులు నేడు స్వామివారి దర్శనానికి పోటెత్తారు.