రమణీయం… మంగళగిరి నృసింహుని దివ్య రథోత్సవం
• రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
• పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి
• భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్త జన సందోహం
జై నారసింహ.. జైజై లక్ష్మీనారసింహ.. జై గోవిందా… జై నారాయణా అన్న భక్తజనుల నినాదాల మధ్య మంగళాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దివ్యరథోత్సవం మంగళవారం నేత్రపర్వంగా సాగింది. రథోత్సవాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి , ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి లు ప్రారంభించారు. నృసింహుని దివ్య రథోత్సవం అశేష భక్త జనవాహిని జయజయధ్వానాల నడుమ నేత్రపర్వంగా సాగింది. మధ్యాహ్నం 3:45లకు ప్రారంభమైన రథోత్సవం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. శ్రీవారి రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తజనులతో నగరవీధులు కిక్కిరిసిపోయాయి. తొలుత ఆలయం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ఉత్సవ మూర్తుల విగ్రహాలను అర్చకస్వాములు మేళతాళాల మధ్య తీసుకువచ్చి దివ్యరథంపై అధిష్టింపజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామివార్లకు హారతులు ఇచ్చిన అనంతరం భక్తులు జై నారసింహ…జైజై నారసింహ అంటూ భక్తి పారవశ్యంతో రథం మోకును లాగారు. పాలు కూడళ్లలో భక్తులు స్వామివార్లను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో టెంకాయలను కొట్టారు.