National

కొత్త బంధంలోకి రకుల్ –  బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానీతో ఏడడుగులు

‘లౌక్యం’ భామ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కబురు చెప్పేసింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె ఎక్స్‌ప్రెస్ వేగంతో తెలుగు చిత్రరంగంలో దూసుకుపోయింది. దాదాపు అందరు టాప్ తెలుగుహీరోలతో నటించి శభాష్ అనిపించుకుంది. ‘నాన్నకు ప్రేమతో’, ‘లౌక్యం’, ‘ధృవ’, ‘సరైనోడు’, ‘బ్రూస్లీ’  వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రకుల్, ఇప్పుడు హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె తెలుగు ప్రేక్షకులతో ముచ్చటించింది. ఈ క్రమంలో తాను తెలుగు తెరకు దూరం కాలేదని, త్వరలోనే టాలీవుడ్‌లో నటిస్తానని చెప్పింది.

బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేయడంతో ఆమె ప్రేమపెళ్లి విషయం వెలుగులోకి వచ్చింది.  వచ్చే సంవత్సరం వారి పెళ్లి ఉండబోతోందని, వారి ప్రేమను తర్వాత లెవెల్‌కి తీసుకెళ్తున్నారని అమన్ ట్వీట్ చేశారు. సోదరుడి ట్వీట్‌పై స్పందిస్తూ ‘నా పెళ్లి గురించి నాక్కూడా చెప్పాలి కదా బ్రో’ అంటూ చమత్కారం చేసింది. జాకీ తండ్రి విష్ణు భగ్నాని కూడా సినీ నిర్మాతే. చాలా రిచ్‌గా సినిమాలను తీసే ఆయన తన కుమారుడి వివాహాన్ని చాలా వైభవంగా జరపబోతున్నట్లు సమాచారం. ఇంకా తేదీ ఖరారు కాలేదని, త్వరలోనే ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయిస్తారని తెలుస్తోంది.