Home Page SliderNationalPolitics

రాహుల్‌ గాంధీని పార్టీ నుంచి తొలగించాలి… ఖర్గేకు బీజేపీ డిమాండ్‌

చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే భారత ప్రభుత్వం నిద్ర పోతోందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ నాయకులు గట్టిగా బదులిచ్చారు. భారత ఆర్మీ నైతికతను దెబ్బతీసేలా వ్యవహరించిన రాహుల్‌ను పార్టీ నుంచి తొలగించాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా డిమాండ్ చేశారు. మల్లికార్జున ఖర్గే నిజంగా రిమోట్‌ కంట్రోల్‌ అధ్యక్షుడు కాకపోతే.. వెంటనే రాహుల్‌ను పార్టీ నుంచి తొలగించాలని భాటియా డిమాండ్‌ చేశారు. ఒకవేళ రాహుల్‌ తొలగించకపోతే ఆయనే పార్టీని ముందుండి నడిపిస్తున్నారని అనుకోవాలన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్‌ అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ వల్ల దేశం పరువుపోతోందని కిరణ్‌ రిజుజు ట్వీట్‌ చేశారు. ఆయనతో కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే కాదు.. దేశం మొత్తానికీ ఇబ్బంది కలుగుతుందన్నారు.