“ప్రజా పాలనా? దర్పమా?” హరీష్ రావు ఫైర్
ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆహార విషప్రయోగ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 70 మంది రోగులు అస్వస్థతకు గురవగా, ఒకరు మరణించారు. బాధితులకు తక్షణ నాణ్యమైన చికిత్స అందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. “మానసిక రోగులకు సురక్షితమైన ఆహారం కూడా అందించలేని పరిస్థితి దారుణం,” అని హరీష్ రావు విమర్శించారు. గురుకులాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఘటిస్తున్న ఇలాంటి ఘటనలు కాంగ్రెస్ పాలనలో సాధారణంగా మారాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం దీనికి కారణమని అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఓ వృద్ధ రైతుపై పోలీసుల దురుసు ప్రవర్తనను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రైతును మెడ పట్టుకొని బయటకు లాగడం అమానుషమని అభివర్ణించారు. లగచర్లలో గిరిజన రైతులకు సంకెళ్లు వేయడం గుర్తుచేస్తూ, ఇప్పుడు రైతుల గొంతులు నొక్కే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేసిన హరీష్ రావు, రైతుల పట్ల జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.