‘ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షి ఫ్రొఫెసర్ జయశంకర్’…ఈటల రాజేందర్
ఫ్రొఫెసర్ జయశంకర్ ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షిగా నిలిచారని కొనియాడారుమల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆల్వాల్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి. జయశంకర్ సార్ 13వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజానీకం ఈరోజు ఘనంగా నిర్వహిస్తుంది. మూడు తరాల ఉద్యమానికి సజీవ సాక్షి ప్రొఫెసర్ జయశంకర్ సార్. 1952 లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969 లో ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ కి సలహాలు సూచనలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు తెలియచెప్పడంలో వారు పోషించిన పాత్ర అనిర్వచనీయం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే జీవించి మరణించి సాధన కోసం అమరులైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఆయన వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. వారి ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజలంతా పునరంకితం కావాలని ప్రతి తెలంగాణ బిడ్డకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను”. అని పేర్కొన్నారు.


