తొలిసారి ఏపీకి వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ద్రౌపది ముర్ము ఏపీకి వస్తున్నారు. రెండు రోజులు పాటు ఆమె ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ,విశాఖపట్నం జిల్లాలో రాష్ట్రపతి డిసెంబర్ 4 ,5 తేదీల్లో పర్యటన షెడ్యూలు ఖరారు అయింది. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రపతి చేతుల మీదగా ప్రారంభించనున్నారు. ఏపీకి రానున్న రాష్ట్రపతికి ఏపీ ప్రభుత్వం పౌర సన్మానం ఏర్పాటు చేసింది. అలానే రాజ్ భవన్లో గవర్నర్ విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి డిసెంబర్ 4న విజయవాడ చేరుకుంటారు. ఆమెకు గవర్నర్ భిశ్వ భూషణ్, సీఎం జగన్ స్వాగతం పలకుతారు. ఆ వెంటనే రాజ్ భవన్‌లో రాష్ట్రపతికి గౌరవార్థం గవర్నర్ విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు సీఎంతో పాటుగా, హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ అధికార ప్రముఖులను ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి అదేరోజు విశాఖ జిల్లాలోని ఆర్కే బీచ్ వేదికగా జరిగే నేవీ డే ఉత్సవాలకు హాజరవుతారు. నేవీ డే కార్యక్రమం ముగించుకొని పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు హాజరవుతారు. నావికాదళ దినోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విశాఖ కలెక్టర్ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, నేవీ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

