వరదవేళ ముందుజాగ్రత్తలు..
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను తుఫాన్లు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల సమయంలో ప్రభుత్వాలు, సహాయక బృందాలు సహాయం అందిస్తున్నాయి. కానీ మనం కూడా వరదలలో, తుఫాన్ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. వీటివల్ల ప్రమాదాలను తప్పించుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వరద ముంపు ఉన్న గ్రామాలలో ప్రజలు కొన్ని ముందుజాగ్రత్త చర్యలు పాటిస్తే చాలా మంచిది.

వరద ప్రవహిస్తున్నప్పుడు వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడైనా వరద ఎక్కువయి ప్రవాహంలో కొట్టుకుపోవచ్చు. వరదనీటిలో నడవడం, దిగడం చేయకూడదు. వరదనీరు పెద్ద పెద్ద వాహనాలను కూడా తోసుకుపోగలదు. రోడ్లపై మురుగుకాలువలు, డ్రైనేజిలు ఓపెన్ అయి ఉంటాయేమో తెలియదు. దీనివల్ల కల్వర్టులకు, కాలువలకు, డ్రైనేజిలకు కూడా దూరంగా ఉండాలి. అలాగే విద్యుత్ స్తంభాలకు, విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలి. ఇంట్లో ఉన్నాకూడా తుఫాను సమయంలో నీరు, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాచి, చల్లార్చిన నీటిని తాగాలి. బయట చిరుతిళ్లకు దూరంగా ఉండాలి. జలుబు, దగ్గు వంటివి వచ్చినప్పుడు వేడినీటి ఆవిరి పట్టడం ఎంతో మంచిది. చలికి తగిన రక్షణ తీసుకోవాలి. శరీరం ఎక్కువ వర్షానికి, చలి ప్రభావానికి గురి కాకుండా వెచ్చటి వస్త్రాలు ధరించాలి. యువత వరద సహాయక చర్యలలో వీలైనంతగా అధికారులకు సహకరించాలి.

