ఆఫీస్ బాయ్‌కు నకిలీ పోలీసుల టోకరా..రూ.5లక్షలతో పరారీ
సికింద్రాబాద్ బోయినపల్లిలో నకిలీ పోలీసులు హల్‌చల్ చేశారు. శనివారం రాత్రి 10 గంటల వేళ ఎంఎంఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డులో తనిఖీల పేరుతో పోలీసుల వేషధారణలో ఇద్దరు వ్యక్తులు ఒక ఆపీస్ బాయ్‌ని మోసం చేసి, రూ.5 లక్షలతో పరారయ్యారు. సికింద్రాబాద్‌లోని ఒక సంస్థలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న అరుణ్ కుమార్‌కు సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ బిక్రమ్ బెహెరా, సుచిత్రలో నివాసం ఉంటున్న అసిస్టెంట్ మేనేజర్ సత్య పాండాకు రూ. 5 లక్షలు ఇవ్వడానికి పంపారు. అతడు ఇవ్వడానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. అతని బ్యాగులో తనిఖీ చేసి, డబ్బు తీసుకుని, దానికి తగిన పత్రాలు తీసుకుని మీ యజమానిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని చెప్పి నగదుతో పరారయ్యారు. మేనేజర్‌కు సమాచారం అందించిన అరుణ్ కుమార్ పోలీసు స్టేషన్‌కు వెళ్లడంతో వారు నకిలీ పోలీసులనే విషయం బయటపడింది. మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.