అంబరాన్నంటిన ఎన్టీఆర్ శతజయంతోత్సవ వేడుకలు
నటసార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతాజయంతోత్సవాలు అంబరాన్ని అంటాయి. ఏపీలోని కృష్ణాజిల్లా పోరంకి వద్ద శుక్రవారం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు వేలాదిమంది ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు. అభిమానుల నినాదాలతో సభ దద్దరిల్లింది. రహదారులు పసుపు మయంగా మారాయి. తొలుత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి సూపర్ స్టార్ రజినీకాంత్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ చారిత్రత్మక ప్రసంగాల పుస్తకాన్ని రజినీకాంత్ ఆవిష్కరించగా అసెంబ్లీ ప్రసంగాల సావనీర్ నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సినీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ పై ప్రముఖ జర్నలిస్ట్ వెంకటనారాయణ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథి రజనీకాంత్ తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్నారు.

రజనీకాంత్ మాట్లాడుతూ తెలుగు మాట్లాడి చాలా రోజులైందని ఏమైనా తప్పులు దొర్లితే క్షమించాలని కోరారు. చంద్రబాబు నాయుడుని 30 ఏళ్ల క్రితం మోహన్ బాబు తనకు పరిచయం చేశారని అప్పుడే మోహన్ బాబు, చంద్రబాబు నాయుడు పెద్ద నాయకుడు అవుతాడని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుతో కలిసి మాట్లాడితే జ్ఞానం పెరుగుతుందని విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయన గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా ఖ్యాతి గడించాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందటానికి లక్షలాది మంది తెలుగు ప్రజలు ఉపాధి పొందటానికి చంద్రబాబు నాయుడు ముందు చూపని రజినీకాంత్ పేర్కొన్నారు.

1956లో తన ఆరవ సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమాను తొలిసారిగా చూశానని ఆ సినిమాలో భైరవి విగ్రహం మనసులో నిలిచిపోయిందని అన్నారు. తాను తొలిసారి హీరోగా భైరవి చిత్రంలో నటించినట్లు పేర్కొన్నారు. టైగర్ చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటించానని ఆనాటి సంగతులను గుర్తు చేస్తున్నారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో చిత్ర నిర్మాతలు అడ్వాన్సులు కూడా తిరిగి తీసుకున్న సమయంలో ఎన్టీఆర్ టైగర్ చిత్రంలో తన పేరును సూచించడం ఆ చిత్రంలో నటించిడం ద్వారా సినీ రంగంలో తనకు తిరిగి గుర్తింపు లభించిందని అన్నారు. ఎన్టీఆర్ నటించిన దుర్యోధన పాత్ర నటించాలని తాను భావించానని అయితే మేకప్ వేసుకొన్న అనంతరం తన మిత్రుడు ఫోటో చూసి కోతి లాగా ఉన్నావు అని పేర్కొనడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టి విజయం సాధించి ప్రపంచంలో నలుమూలల తెలుగు భాషకు ఎన్టీఆర్ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ వ్యక్తి కాదని ఒక శక్తి అని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలన్నారు. నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ అనేక విప్లమాత్మకమైన సంస్కరణాలు తీసుకొచ్చారన్నారు ప్రజల వద్దకు పాలన అందించాలని లక్ష్యంతో మండల వ్యవస్థను తీసుకువచ్చారని చెప్పారు.
