ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నా.. వెబ్ సిరీస్‌పై వెంకటేష్ స్పందన
రానా నాయుడు వెబ్ సిరీస్‌పై విక్టరీ వెంకటేశ్ స్పందించారు. ఇటీవల ఓటీటీ వేదికగా రీలీజైన రానా నాయుడు వెబ్ సిరీస్‌లో వెంకటేశ్, రానా దగ్గుబాటి నటించారు. దగ్గుబాటి కుటుంబానికి చెందిన స్టార్లు నటించడంతో ఈ వెబ్ సిరీస్‌పై మరింత క్రేజ్ పెరిగింది. అయితే అందులోని కంటెంట్, డైలాగులు, అశ్లీల దృశ్యాలు విమర్శలకు దారి తీశాయి. ఓ ఇంటర్వ్యూలో రానా నాయుడు వెబ్ సిరీస్‌పై వెంకటేశ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సిరీస్‌లో తాను పోషించిన పాత్ర సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. అత్యుత్తమ నటన కనబర్చానని భావిస్తున్నానని వెంకటేశ్ అన్నారు. ఇప్పటి వరకు తనకు ఫ్యామిలీ హీరో క్రేజ్ ఉందని వివరించారు. ఇలాంటి పాత్రలు గతంలో ఎప్పుడూ చేయలేదని.. ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నానని వెల్లడించారు. వెబ్ సిరీస్‌లో నటించడం అనేది వ్యక్తిగతంగా తనకు చాలా కొత్తగా అనిపించిందని వెంకటేశ్ పేర్కొన్నారు.

రానా మాట్లాడుతూ… బాబాయ్‌తో కలిసి సిరీస్‌లో నటించినందుకు ఆనందంగా ఉంది. ఏదైనా విభిన్నంగా.. అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాం. ఇదొక విభిన్నమైన ఫ్యామిలీ డ్రామా అని రానా చెప్పారు. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైంది. సిరీస్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం ఎక్కువగా ఉన్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేశారు. వెంకటేశ్ నుంచి ఈ తరహా పాత్రలు చేస్తారని తాము ఊహించలేదంటూ సోషల్ మీడియాలో ప్రేక్షకులు విమర్శలు చేశారు.