మోదీ ఒక అద్భుతం, వచ్చే వారం కలుస్తానంటున్న డొనాల్డ్ ట్రంప్
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో కలుస్తానని చెప్పారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మిచిగాన్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఈ విషయాన్ని చెప్పారు. ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి అని ట్రంప్ కితాబిచ్చారు. ” వచ్చే వారం నన్ను కలవడానికి వస్తాడు” అని ట్రంప్ ప్రకటించాడు. ఐతే పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ డెలావేర్‌లోని విల్మింగ్‌టన్‌లో హోస్ట్‌గా నిర్వహించనున్న నాలుగో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో మోదీ పాల్గొంటారు. ఆదివారం న్యూయార్క్‌లోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

సోమవారం న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో కూడా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ‘మెరుగైన రేపటి కోసం అనేకరకాల పరిష్కారాలు’ సమావేశంలో మోదీ పాల్గొంటారు. AI, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్స్, బయోటెక్నాలజీ అత్యాధునిక రంగాలలో రెండు దేశాల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించడానికి ప్రధాన మంత్రి అమెరికా కంపెనీల CEO లతో కూడా భేటీ అవుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా-ఇండియా ద్వైపాక్షిక సమావేశంలో కూడా మోదీ పాల్గొంటారు. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా ఫిబ్రవరి 2020లో అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించినప్పుడు కలుసుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది ముఖ్యమైన సమావేశమని నాడు మోదీ అన్నారు.

