యూఎస్ టెన్నెస్సీలో భారీ పేలుడు – 19 మంది బలి
అగ్రరాజ్యం ఆమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. ఓ మిలిటరీ యుద్ధసామగ్రి ప్లాంట్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన తరువాత 19 మంది అచూకీ లభ్యం కాలేదు. పేలుడు ధాటికి ఒక్కసారిగా సమీపంలో ఉన్న కార్లు ఎగిరిపడ్డాయి. వాటికి మంటలు అంటకుని దగ్ధమయ్యి, ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది.
మరోవైపు ,పేలుడు శబ్దం కొన్ని మైళ్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమీపంలోని ఇళ్లు, పార్క్ చేసి ఉన్న వాహనాలు ఒక్కసారిగా కదలిపోయాయి. ఈ నేపధ్యంలో సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. పేలుడుకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అక్యూరేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్‌కు కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది.