ఇండోనేషియాలో భారీ భూకంపం
ద్వీపదేశమైన ఇండోనేషియాలో భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. దీని కారణంగా 44 మంది మృత్యువాత పడ్డారు. కాగా 300 వందల మందికి పైగా గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హాస్పటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ భూకంపం ఈ రోజు ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సంభవించింది. జకార్తాలోని నసియాంజూర్ ప్రాంతంలో దాదాపు 49 సెకన్లపాటు భూమి కంపించింది.అయితే రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.6 గా నమోదైనట్లు సమాచారం. దీంతో వేలాది ఇళ్ళు నేలకొరిగాయి. భూకంపం దాటికి భవనాలు కుంగిపోయాయి. అంతేకాకుండా ఓ పాఠశాల ధ్వంసమైంది. అక్కడి ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు,పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని వారు తెలిపారు. దీని కారణంగా భారీ ఆస్తినష్టం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

