అమెరికాలో హత్యాకాండ.. ఆరుగురు బలి
అమెరికాలో మరోసారి తుపాకీ మోత కలకలం రేపింది. మిసిసిప్పీ రాష్ట్రంలోని క్లే కౌంటీలో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు గురి చేసింది. 24 ఏళ్ల యువకుడు ఒకే రాత్రిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిపి ఆరుగురిని హత్య చేశాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి గ్రామీణ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల్లో నిందితుడి తండ్రి, సోదరుడు, మామతో పాటు ఏడేళ్ల చిన్నారి, ఓ చర్చ్ పాస్టర్, ఆయన సోదరుడు ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడిని డారికా ఎం. మూర్‌గా గుర్తించారు. ఘటన తర్వాత మిసిసిప్పీ రాష్ట్రంలోని సీడర్‌బ్లఫ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రోడ్డుబ్లాక్ వద్ద శనివారం అర్ధరాత్రికి ముందు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ పోలీసు బలగాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.
క్లే కౌంటీ షెరీఫ్ ఎడ్డి స్కాట్ తెలిపిన వివరాల ప్రకారం, మూర్ మొదట పశ్చిమ క్లే కౌంటీలోని ఓ మట్టి రోడ్డుపై ఉన్న తన కుటుంబం వైపు వెళ్లాడు. అక్కడ తన తండ్రి గ్లెన్ మూర్ (67), సోదరుడు క్వింటన్ మూర్ (33), మామ విల్లీ ఎడ్ గైన్స్ (55)లను కాల్చి చంపాడు. తర్వాత మూర్ తన సోదరుడి ట్రక్కును దొంగిలించి కొద్ది మైళ్ల దూరంలో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఏడేళ్ల చిన్నారిని తుపాకీతో బెదిరించి కాల్చి చంపాడు. మరో చిన్నారిపై కూడా కాల్పులకు యత్నించినప్పటికీ ఆమె ప్రాణాలతో బయటపడింది. తుపాకీ పనిచేయలేదా, లేక నిందితుడు కాల్చలేదా అన్నది ఇంకా స్పష్టత లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన సమయంలో ఆ ఇంట్లో చిన్నారి తల్లి, మరో బిడ్డ కూడా ఉన్నట్లు వెల్లడించారు. ‘‘ఏడేళ్ల చిన్నారిని హత్య చేయడం అత్యంత అమానుషం’’ అంటూ షెరీఫ్ ఎడ్డి స్కాట్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడితో ఆగని మూర్, ఆ తర్వాత అపోస్టోలిక్ చర్చ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ అనే చిన్న చర్చ్ వద్దకు వెళ్లాడు. అక్కడ నివాసంలోకి చొరబడి పాస్టర్ రెవ. బ్యారీ బ్రాడ్లీ, ఆయన సోదరుడు శామ్యూల్ బ్రాడ్లీని కాల్చి చంపాడు. తర్వాత అక్కడి నుంచి మరో వాహనాన్ని దొంగిలించి పరారయ్యాడు. మొత్తం ఘటనపై మొదటి కాల్ వచ్చిన నాలుగు గంటలన్నర తర్వాత రాత్రి 11:24 గంటలకు మూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఒక రైఫిల్, ఒక హ్యాండ్‌గన్ ఉన్నట్లు జిల్లా అటార్నీ స్కాట్ కొలమ్ తెలిపారు. ఆయుధాలు ఎక్కడ నుంచి వచ్చాయన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
మూర్ ప్రస్తుతం క్లే కౌంటీ జైలులో బెయిల్ లేకుండా రిమాండ్‌లో ఉన్నాడు. సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసులో క్యాపిటల్ మర్డర్ ఆరోపణలు నమోదు చేసి మరణశిక్ష కోరనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో క్లే కౌంటీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

