7 నెలల్లో 25 మందితో పెళ్లి..కిలాడీ లేడీ ఏం చేసిందంటే..
అనూరాధా పాశ్వాన్ అనే కిలాడీ లేడీ 7 నెలల వ్యవధిలోనే 25మందిని వివాహం చేసుకుని కోట్లు కొల్లగొట్టింది. ఈ నిత్యపెళ్లికూతురిని ప్లాన్ చేసి వల వేసి పట్టుకున్నారు రాజస్థాన్ పోలీసులు. వయసు పైబడుతున్నా ఇంకా పెళ్లి కాని యువకులను టార్గెట్ చేసి, పెళ్లి చేసుకుని విలువైన వస్తువులతో ఉడాయిస్తూండేది యూపీకి చెందిన అనూరాధ పాశ్వాన్(23). ఆమె భర్తతో విభేదాలతో విడాకులు తీసుకుంది. తర్వాత యూపీ నుండి మధ్యప్రదేశ్‌కు వచ్చి, భోపాల్‌లోని ఒక పెళ్లిళ్ల ముఠాతో చేతులు కలిపింది. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న యువకులను లక్ష్యంగా చేసుకుని ఆకర్షించి అనూరాధనిచ్చి పెళ్లి చేసేవారు. ఈ వివాహానికి కమిషన్ తీసుకునేవారు. కొన్ని రోజులు అత్తగారింట్లో ఉన్న ఆమె వీలు చూసుకుని బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే పారిపోయేది. ఇలా వివిధ రాష్ట్రాలు మారుతూ 7 నెలల్లో 25 మందిని మోసం చేసింది. ఒక వ్యక్తి రూ.2 లక్షలు కమిషన్ ఇచ్చి, ఆమెను వివాహం చేసుకుని పారిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలివిగా ఒక కానిస్టేబుల్‌ను పెళ్లి కొడుకు వేషంలో పంపి, ఏజెంట్లతో మాట్లాడి, అనూరాధ వివరాలు తెలుసుకున్నారు. ఈ వివరాలను బట్టి పోలీసులు రెయిడ్ చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

