Andhra PradeshNews

“మనసర్కారు” వచ్చేస్తోంది

ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు… ప్రజలు కోరుకున్న విధంగా పాలన సాగించడమే పాలకుల పరమావధి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి… ప్రజలే ప్రభువులన్న సందేశాన్ని ఇవ్వడమే పాలకుల లక్ష్యం. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా అమృతోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇంకా ఎంతో సంఘర్షణ ఎదుర్కొంటూనే ఉన్నాం… వాటన్నింటికీ పరిష్కార మార్గాలు చూపించాల్సిన నాయకుల నిర్లక్ష్యం, ముందుచూపు లేమితో వ్యవస్థలు కునారిల్లుతున్నాయ్. తెలుగు ప్రజలకు వాస్తవాలను అందించేందుకు… ఎన్నో వార్త సంస్థలు ఉన్నాయి. మాధ్యమాలు మారుతున్నాయి… మనుషులు మారుతున్నారు. కానీ ప్రజాస్వామ్య పరమార్థం మాత్రం సాకారం కావడం లేదు. వామ్మో మీడియా అనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో… మీడియా అంటే ఇది మన ప్రభుత్వం… ఇది “మనసర్కార్”… ఇది మన జాగీర్ అని చెప్పుకోవాల్సింది పాలకులు కాదు.. ప్రజలు.

ఇదే ఉద్దేశంతో ఒక మహాయజ్ఞాన్ని ఆరంభించాలని నిర్ణయించాం. ప్రజలు కోరుకునే విధంగా ప్రభుత్వం ఉండాలన్న ఉద్దేశంతోనే మనసర్కార్ డిజిటల్ ప్లాట్ ఫ్లామ్ ప్రారంభిస్తున్నాం. చైతన్యవంతమైన తెలుగు సోషల్ నెటిజన్లకు వీనుల విందైన నిఖార్సయిన వార్తలను… తాజాగా ఎప్పటికప్పుడు అందించేందుకు “మనసర్కార్”ను మీ ముందుకు తీసుకొస్తున్నాం… పాలకులు ప్రజలు ఇచ్చిన పదవులను పేరు కింద డిగ్రీలుగా పెట్టుకోవడం కాదు… ప్రజల డిగ్రీ పెరిగి ఇది నా సర్కార్ … ఇది నా కోసం పనిచేసే సర్కార్ అని వారి ఇళ్ళ ముందు “మనసర్కార్” అని బోర్డులు పెట్టుకునే స్థాయికి ప్రజాస్వామ్యం పరిణితి చెందాలి.. ఇలా మన వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు తెలుగు ప్రజల గొంతుకగా మీ ముందుకు వస్తున్నాం.