Home Page SliderTelangana

బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్‌లు చేయడం, గృహానిర్భంధం చేయడం దుర్మార్గం

‘బాటసింగారం’లో డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచారకమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సహా పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. బీజేపీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు పోలీసు వాహనాలు మొహరించారు. దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ “2ఏళ్ళల్లో ప్రగతి భవన్ నిర్మించుకున్న కేసీఆర్‌కు, 9 ఏళ్ళు దాటుతున్నా పేదల డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం మాత్రంచేయడం చేతకాలేదా? దీనిని బట్టి   బీఆరెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో అర్ధం అవుతుంది. పేదలకోసం గొప్పగా కట్టామని చెబుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూడడానికి వెళ్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉలికిపాటెందుకు?”  అని ప్రశ్నించారు. “ఇదేమైనా ఉద్యమమా? లేక తిరుగుబాటా?  కేవలం ఇండ్లు చూడడానికి వెళ్తుంటే భయమెందుకు,ఇప్పుడే ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభమైంది. బీఆర్ఎస్ ను గద్దెదించే వరకు ఈ ఉద్యమం ఆగదు.హౌస్ అరెస్ట్ లు అక్రమ అరెస్టులు బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట” అని మండిపడ్డారు. అంత గొప్పగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించామని చెప్పుకునే బీఆర్‌ఎస్ ఈ అక్రమ అరెస్టులకెందుకు పాల్పడిందని ఎద్దేవా చేశారు. విపక్షాల గొంతునొక్కడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అరెస్టులు చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.