ఇక ప్రచారం షురూ చేయాలె
భువనగిరి: ప్రధాన పార్టీల అభ్యర్థిత్వాలు కన్‌ఫర్మ్ అయ్యాయి. అసంతృప్తి నేతలకు బుజ్జగింపులు మొదలయ్యాయి. మరోవైపు వారు ప్రచార వ్యూహరచన చేస్తున్నారు. నామినేషన్లు వేసేందుకు ముహూర్తం కోసం పండితులను ఆశ్రయిస్తున్నారు. నామినేషన్ల పర్వంలో బలనిరూపణకు భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు తలమునకలయ్యారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు, గోడపత్రికలు ఆకర్షణీయంగా ముద్రించారు. తమకు అనుకూలంగా ఉండే ప్రజలతో పరిచయాలు పెంచుకుంటున్నారు. నామినేషన్ల పర్వంలో బలనిరూపణకు భువనగిరి అసంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు తలమునకలయ్యారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు, గోడపత్రికలు ఆకర్షణీయంగా ముద్రించారు. తమకు అనుకూలంగా, ప్రజలను ఆకర్షించేలా రచయితలతో పాటలు రాయించి సీడీలు రెడీ చేయించారు. ప్రచార రథాలు రోడ్డెక్కడమే తరువాయి. కళాబృందాల ప్రదర్శనకు తమపార్టీ రంగులతో వాహనాలను రెడీ చేశారు. రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులతో ప్రచార నిర్వహణకు తేదీలు నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా ప్లానింగ్‌లో ఉన్నారు. అందరికన్నా ముందుగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డిని ఎంపిక చేసి వారం రోజులు అయ్యింది. చివరగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి పేరు ఈ నెల 27న అధిష్ఠానం ప్రకటించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది.
డోర్ టు డోర్ ప్రచారం: ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి ప్రచారం మొదలవ్వగా, ఈ నెల 16న భువనగిరిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ సక్సెస్ అవడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకెడుతున్నారు. ఇదే ఉత్సాహంతో గ్రామాల్లో ఇంటింటా ప్రచారానికి పైళ్ల పరివారం దిగింది. హైదరాబాద్ నుండి భువనగిరికి మకాం మార్చారు. భార్య వనిత, కూతురు మన్వితారెడ్డి గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తనకే టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో అభ్యర్థిత్వం ఖరారు కాకుండానే ప్రచారాన్ని షురూ చేశారు. మండలాలవారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో చేరేవారికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. భువనగిరి పట్టణంలో రెండుసార్లు భారీ ర్యాలీలు చేపట్టారు. మాజీ మంత్రి జానారెడ్డితో మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. భువనగిరి మండలంలో గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. కూతురు కీర్తిరెడ్డి, కుమారుడు శ్రీరాంరెడ్డి మండలాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు గూడూరు నారాయణరెడ్డిని రంగంలోకి దింపింది. నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రచార నిర్వహణ, నాయకులకు బాధ్యతలు ఇవ్వడంపై చర్చించినట్లు సమాచారం. పకడ్బందీ ప్రణాళికతో ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. త్వరలో ప్రచారం మొదలవ్వడం ఖాయం.