రాజ్యసభలో భాషా వివాదం..క్షమాపణలు చెప్పిన ఖర్గే..
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నేడు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. జాతీయ ఎడ్యుకేషన్ విధానంపై డీఎంకే, బీజేపీ పార్టీ ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే కలుగజేసుకుని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడున్నారని, తాము చర్చ చేపట్టేందుకు సిద్ధమని ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వాన్ని తోసి వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఈ మాటలు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్‌ను అవమానించేలా ఉన్నాయని, అసభ్య పదజాలాన్ని వాడారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆందోళన చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో మల్లి కార్జున ఖర్గే దిగొచ్చి క్షమాపణలు చెప్పారు. తాను ఛైర్మన్‌ను ఉద్దేశించి అనలేదని, కేవలం ప్రభుత్వ విధానాల పైనే వ్యాఖ్యానించానని పేర్కొన్నారు. అభ్యంతరకరంగా అనిపిస్తే క్షమాపణలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.