లిక్కర్ కేసులో ఇరుక్కొని బీజేపీని తిడితే ఏం వస్తుందన్న కిషన్ రెడ్డి
ఢిల్లీ లిక్కర్ వ్యాపారం ద్వారా అక్రమంగా డబ్బులు సంపాదించి అరెస్ట్ అయితే బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అక్రమాలు చేయమని మేం చెప్పామా..? లక్షల విలువ చేసే ఫోన్లు పగులగొట్టమని మోదీ చెప్పారా.? సీబీఐ రోజుకో కేసు పెడుతుందని వాటితో బీజేపీకి సంబంధం ఏంటన్నారు కిషన్ రెడ్డి. మీరు తప్పు చేసి.. సీబీఐ మిమ్మల్ని పట్టుకుంటే తెలంగాణ సమాజానికి అపాదిస్తారా…అని దెప్పిపొడిచారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి, హైదరాబాద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక మీటింగ్ కు హాజరైన కిషన్ రెడ్డి, బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి AVN రెడ్డిని గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయుల అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన సమయమాసన్నమైందన్నారు. ఉపాధ్యాయుల్ని డబ్బులతో కొని ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ అనుకుంటున్నారని ఉపాధ్యాయ సమాజానికి కల్వకుంట్ల కుటుంబపాలన గురించి తెలుసని అన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై స్పందించిన కిషన్ రెడ్డి.. ఢిల్లీ ప్రజల రక్తాన్ని తాగేందుకు ఆప్ ప్రయత్నం చేస్తుంటే.. దానిలో బీఆర్ఎస్ నేతలు భాగస్వాములు అయ్యారని విమర్శించారు. ఐదేళ్లు మహిళా మంత్రిని పెట్టని మీరు మహిళ రిజర్వేషన్ కోసం మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తే .. తెలంగాణ సర్కార్‌లా… తాము అడ్డుకోమన్నారు. నిజంగా నీతి మంతులైతే దేనికి భయపడరన్నారు కిషన్ రెడ్డి. మీరు నీతి మంతులైతే సెల్ ఫోన్లు ఎందుకు పగులగొట్టారని ప్రశ్నించారు. ఎందుకు గగ్గొలు పెడుతున్నారు. మీరు తప్పు చేసి సీబీఐ పట్టుకుంటే తెలంగాణ సమాజాన్ని పట్టుకున్నట్టా.. మీరు మీ కుటుంబమే తెలంగాణ సమాజమా..? మేము, ప్రజలు తెలంగాణ సమాజం కాదా.. అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. గవర్నర్‌ను అవమానిస్తారు.. మాపై కేసులు పెడతారు.. పాదయాత్రలు చెయ్యనివ్వరు.. మేం ఉత్తరాలు రాస్తే స్పందించరు. ఏ విధంగా తెలంగాణలో పరిపాలన చేస్తున్నారు. ఈడీ, సీబీఐ విషయంలో మేం జోక్యం చేసుకోమన్నారు కిషన్ రెడ్డి. చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. అన్నింటికి మించిన న్యాయ వ్యవస్థ ఉంటుందన్నారు. సీబీఐ, ఈడీ గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా అనేక కేసుల్లో చాలా మందిని అరెస్ట్ చేశాయి. అప్పుడు ఏం మాట్లాడలేదే.. అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఇప్పుడే ఎందుకు గగ్గొలు పెడుతున్నారు.. మోదీ ప్రధానిగా ఉన్నారనా అని ప్రశ్నించారు.

శాసన సభలో తెలంగాణ సమస్యలపై కాకుండా మోడీని తిట్టడానికే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు కిషన్ రెడ్డి. శాసన సభను కేంద్రాన్ని, మోదీని తిట్టడానికి వేదికగా వాడుకున్నారన్నారు. ఇలాంటి వారు దేశంలో గుణాత్మకమైన మార్పును తీసుకువస్తారా అని ప్రశ్నించారు. శాసన సభ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ, సీఎం వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను నాశనం చేశారన్నారు. సచివాలయానికి రాని సీఎం ఎందుకు దానిని కూలగొట్టాడో చెప్పాలన్నారు. ఇంజనీరింగ్, రెసిడెన్షియల్ కాలేజీల్లో కూడా మాఫియా పెత్తనం పెరిగిపోయిందన్నారు. కాలేజీ విద్యార్థినులు ర్యాగింగ్ వల్ల చనిపోతున్నారన్నారు. వాటిపై దృష్టి పెట్టకుండా ఎవరిని ఎలా తొక్కాలో.. ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలో అనే దానిపై ఆలోచిస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద నేరుగా అకౌంట్ లో దళిత విద్యార్థులకు కేంద్రం డబ్బులు వేస్తుంటే.. తెలంగాణ మాత్రం నేరుగా వేయడానికి అంగీకరించలేదన్నారు. ఇలా తెలంగాణ పెండింగ్ లో ఉన్న 300 కోట్ల రూపాయలు విద్యార్థులకు పంపించండి అని ఎన్ని ఉత్తరాలు రాసినా స్పందన లేదన్నారు. మంత్రివర్గాన్ని నిర్వీరం చేశారన్నారు. నిర్ణయాలు అన్ని ప్రగతి భవన్ లోనే జరుగుతున్నాయన్న కిషన్ రెడ్డి.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై నిర్ణయాలు ప్రగతి భవన్ డైనింగ్ టేబుల్ పై తీసుకుంటున్నారని ఆరోపించారు.

మజ్లిస్ నేతలకు తప్ప.. ప్రగతి భవన్‌లోకి ఇతరులకు అనుమతి లేదన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటలను ఓడించేందుకు తీసుకువచ్చిన దళిత బంధు .. ఇప్పటి వరకు అమలు చేయలేదని… ఓ 50 ఏళ్లు పడుతుందా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రైతు బంధు, నిరుద్యోగ భృతి, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్స్ ఏం అయ్యాయన్నారు. ఉచితంగా రైతులకు ఇస్తానన్న ఎరువులు ఎక్కడికి పోయాయన్నారు. కేంద్ర 3 వేల రూపాయల ఎరువుల బస్తా రూ. 250లకు ఇస్తోంది. మిగిలిన భారం కేంద్రం భరిస్తోంది. 9 ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్న కిషన్ రెడ్డి.. ఏపీ పేరుతో రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. మాటల కోటలు దాటతాయి కాని.. పనులు ప్రగతి భవన్ దాటవన్నారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీలో వర్క్స్ చేసిన కాంట్రాక్టర్లు డబ్బుల కోసం ధర్నాలు చేస్తున్నారు. ఇస్తాంబుల్, సింగపూర్ మాటలు ఏం అయ్యాయి. రోడ్లపై గోతిని చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తానన్నారు. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు పోయే సమయం ఆసన్నమైందన్న కిషన్ రెడ్డి… అన్ని ప్యాక్ చేసుకొని సిద్ధంగా ఉండలన్నారు. తెలంగాణలో బీజేపీనే సమర్థవంతమైన పాలన అందించగలుగుతుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం కంటే 100 రెట్లు మెగుగైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కిషన్ రెడ్డి. అన్నింటి కంటే నీతివంతమైన ప్రభుత్వాన్ని నెలకొల్పుతామన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు.

