వైసీపీలోకి కూటమి కీలక నేతలు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష హోదా అంశంపై హైకోర్టులో పిటిషన్ లు , వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా చర్చలు, పార్టీ బలపర్చుకునే వ్యూహాల మధ్య.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన కూటమి పార్టీల నేతలు గురువారం వైసీపీ లో చేరారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జగన్ స్వయంగా టీడీపీ, బీజేపీకి చెందిన కీలక నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైసీపీలో చేరిన వారిలో కె.ఆర్. మురహరి రెడ్డి ఎమ్మిగనూరు బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్, కిరణ్ కుమార్ బీజేపీ ఎమ్మిగనూరు టౌన్ ప్రెసిడెంట్, మాల మధుబాబు టీడీపీ మాజీ కౌన్సిలర్, చేనేత మల్లికార్జున టీడీపీ ఎమ్మిగనూరు టౌన్ జనరల్ సెక్రటరీ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్.వి. మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
గత కొన్ని నెలలుగా వైసీపీ నుంచి నేతలు వైదొలుగుతున్న తరుణంలో, తిరిగి పార్టీలో చేరికలు జరగడం క్యాడర్‌కు ఊపునిచ్చినట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు చెందిన టీడీపీ, బీజేపీ నేతల వైసీపీ ప్రవేశం, భవిష్యత్ రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపనుందని అంచనా.జగన్ ఇప్పటికే “జగన్ 2.0” పేరుతో పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న నేపథ్యంలో, ఈ చేరికలు వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి.