కేకః….కేకస్య….కేకోభ్యః
నీకు బీపి వస్తే…నీ పిఏ వణుకుతాడేమో…నాకు బీపి వస్తే ఏపియే వణికిద్ది అని బాలకృష్ణ సినిమా డైలాగ్‌ని బాగా ఒంటబట్టించుకున్నారో ఏమో గానీ…పోలీసులకే చుక్కలు చూపారు విద్యుత్ డిపార్ట్ మెంట్ వాళ్లు.వివరాల్లోకి వెళ్తే… మెదక్ జిల్లా కేంద్రంలో పనిచేసే ట్రాన్స్ కో సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా బైక్ పై ప్రయాణిస్తున్నారు.అయితే ఇది ట్రిపుల్ రైడింగ్.ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ కానిస్టేబుల్ ఫోటో తీసి వాళ్ల యాప్‌లో అప్లోడ్ చేశారు.ఆ ముగ్గురు సిబ్బంది బైక్ నుంచి కిందకు దిగే లోపే ఆ వాహనదారునికి ..మీకు పెనాల్టీ విధించబడింది అని మెసేజ్ వచ్చింది.దీంతో కోపోద్రిక్తులైన కరెంట్ డిపార్ట్ మెంట్ సిబ్బంది జరిగిన విషయాన్ని తమ ఉన్నతాధికారులకు చెప్పారు.ఇంకేముంది…మెదక్ లో ఎక్కడెక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అనధికారికంగా నడుపబడుతున్నాయో వాటన్నింటిని కరెంట్ సిబ్బంది కట్ చేశారు.దీంతో పోలీసులు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేక లబోదిబో అంటున్నారు.దీనిపై విద్యుత్ శాఖ ఏఈని వివరణ కోరితే… విద్యుత్ మీటర్లు బిగించుకోనందునే కట్ చేశామని సమాధానం ఇచ్చారు.దీంతో పోలీసులకు బోధపడి…ఆ చలానాని వాళ్లే కట్టారు.మీ దగ్గరున్న లాఠీకే అంత పవరుంటే…మా దగ్గరుండే కరెంట్‌కి ఇంకెత పవరుండాలి అంటూ మెదక్ సోషల్ మీడియా కేంద్రంగా ఈ వ్యవహారం వైరల్ అవుతుంది.

