Home Page SliderTelangana

కేసీఆర్ ముందస్తు ఎత్తుగడ… బీజేపీ ముఖ్యులతో అమిత్ షా, నడ్డా భేటీ

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చనే ఆందోళనల కారణంగా ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర ఎన్నికల కోసం యుద్ధ ప్రణాళికను రూపొందించడానికి తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు పార్టీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. బీజేపీ ఎన్నికలకు సిద్ధం కాక ముందే… కేసీఆర్, ముందస్తుకు వెళ్తారని బీజేపీ తర్జనభర్జనపడుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి… బీఆర్‌ఎస్ నాయకురాలు, కేసీఆర్ కుమార్తె… కె కవితతో సంబంధం ఉన్న వ్యక్తుల అరెస్టుల నేపథ్యంలో బీజేపీ సరికొత్త వ్యూహరచనతో అడుగులు వేయాలని భావిస్తోంది.

ఇటీవల రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియాను కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. అంతకు ముందే… కవిత మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్లని సీబీఐ అరెస్టు చేసింది. సిసోడియా అరెస్టును కేసీఆర్ ఖండించారు. “ప్రధాని- అదానీ బంధం నుండి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం” అని అన్నారు. కవితను తదుపరి అరెస్టు చేసే అవకాశం ఉందని బీజేపీ నేత ఒకరు పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని.. కవితను కూడా త్వరలో అరెస్ట్ చేస్తారని తెలంగాణ బీజేపీ నేత వివేక్ వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా 11,000 స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించేందుకు బీజేపీ ప్రచారాన్ని సమీక్షించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమిత్ షా, సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికలు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాదరణపైనే ఎక్కువగా దూసుకెళ్తున్న బీజేపీ ప్రచారం ప్రాంతీయ అనుబంధాలు బలంగా ఉన్న తెలంగాణలో ఎలా పనిచేస్తోందనన్న బెంగ ఉంది.