Telangana

కేసీఆర్‌.. నీ కుట్ర లేదని యాదాద్రిలో ప్రమాణం చేస్తావా..?

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ రచించిన కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ ప్రకారమే జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని యాదాద్రిలోని లక్ష్మినరసింహ స్వామిపై ప్రమాణం చేయగలవా..? అని కేసీఆర్‌కు సవాల్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ కట్టుకథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటారని విమర్శించారు. ఫాంహౌస్‌లో దొరికిన వాళ్లు బీజేపీ వాళ్లని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఫాంహౌస్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదేనని.. ఫిర్యాదు చేసిందీ వాళ్లేనని.. నిందితులూ.. బాధితులూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే అని స్పష్టం చేశారు. దీనిపై కొన్ని మీడియా చానళ్లు అబద్ధపు వార్తలు ప్రసారం చేస్తున్నాయని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఒక మంత్రిపై హత్యాయత్నం జరిగిందని డ్రామాలాడిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పుడు బేరసారాల డ్రామా ఆడుతున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు. బేరసారాలకు ఎక్కడైనా స్వామీజీలు వెళ్తారా..? అని ప్రశ్నించిన బండి సంజయ్‌.. హిందూ ధర్మం అంటే కేసీఆర్‌కు ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు మూడు రోజుల నుంచి ఈ కుట్ర చేశారని.. కేసీఆర్‌ నాటకమంతా త్వరలోనే బయట పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. హిందూ సమాజాన్ని కించ పరిచేందుకు కుట్ర పన్నిన కేసీఆర్‌ మెడకే ఈ వ్యవహారం చుట్టుకుంటుందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు. ఫాం హౌస్‌ అడ్డాగా గుట్కా వ్యాపారం జరుగుతోందని ఆరోపించారు.