Home Page SliderNational

పోతే పోనివ్వండి.. షెట్టర్‌కు ఏం తక్కువ చేశామని కాంగ్రెస్‌లో వెళ్లాడు..!?

మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ నిరాకరించడంతో పార్టీ నుంచి వైదొలగాలని మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ తీసుకున్న నిర్ణయం సమంజసం కాదన్నారు కర్ణాటక బీజేపీ ముఖ్యనేత, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప. జగదీష్ షెట్టర్ నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించరని, ఆయనను క్షమించరని చెప్పారు. షెట్టర్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారని ఆయనకు పార్టీ చేసిన అన్యాయమేంటని ప్రశ్నించారు. కర్నాటక ప్రజలు, నియోజకవర్గ ప్రజలు షెట్టర్‌ను క్షమించబోరన్నారు.

పార్టీ కేంద్ర నాయకత్వం షెట్టర్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తామని సూచించిందని, రాజ్యసభ సభ్యుడిని, కేంద్ర మంత్రిని కూడా ఆఫర్ చేసిందని వివరించారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని పార్టీ తనను కోరలేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. షెట్టర్ కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్తున్నారు? అధికారం ఇవ్వమని బీజేపీ చెప్పలేదు కదా అంటూ ఆక్షేపించారు. షెట్టర్ ముందుగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని… అందుకే బీజేపీని వదిలేశారన్నారు. ఎవరెన్ని చేసినా కర్నాటకలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తోందన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదన్న యడ్యూరప్ప, స్పష్టమైన మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వబోమని పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టం చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, కాషాయ పార్టీతో తెగదెంపులు చేసుకుంటానని శనివారం చెప్పినట్టుగానే షెట్టర్ వ్యవహరించారు. 67 ఏళ్ల వయసులో తాను ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు. ఉత్తర కన్నడ జిల్లా సిర్సీలో అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరికి ఆయన రాజీనామా సమర్పించారు.