Andhra PradeshHome Page Slider

తెలంగాణ మట్టి బిడ్డ పీవీ నర్సింహారావు: ఈటల రాజేందర్

Share with

తెలంగాణ మట్టిబిడ్డ పీవీ నరసింహారావుకి భారతరత్న పురస్కారంతో గౌరవించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యావాదాలు తెలిపారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. నిజాం నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగినప్పుడు నాగపూర్ కేంద్రంగా క్యాంపులో ఉండి పేదప్రజల కోసం తపాకి పట్టుకుని పోరాడిన బిడ్డ పీవీ నర్సింహారావు. విద్యార్థి దశలోనే ఆనాటి నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చి, చురుకుగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు దశాబ్ధాలకు పైగా శాసనసభ్యులుగా పనిచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దున్నేవారికే భూమి ఉండాలని భూసంస్కరణలను సమున్నతంగా అమలు చేసిన మహనీయుడు పీవీ అన్నారు ఈటల. కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో వందల ఎకరాలు కలిగిన భూస్వామిగా ఉన్న పీవీ.. వందలాది ఎకరాల సొంత భూమిని పేదలకు పంచిపెట్టారన్నారు.

పీవీ బహుభాషా కోవిదుడు. ఇతర దేశాల్లోని భాషలను కూడా అవపోసన పట్టారన్నారు ఈటల రాజేందర్. ప్రధానమంత్రి అయిన వెంటనే దేశ ప్రజలు కష్టాలు తీర్చేలా.. భారత్ ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టేందుకు భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల కోసం పీవీ మార్గదర్శనం చేశారన్నారు. పీవీ నర్సింహారావు తనకు ఏ బాధ్యత కట్టబెట్టినా వన్నె తెస్తూ.. మచ్చలేకుండా పాలన అందించారన్నారు. పీవీ దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి కావడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు. అయితే.. ప్రధాని పీవీ నర్సింహారావు మరణించిన సమయంలో అంత్యక్రియల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం గౌరవించలేదన్నారు. పీవీ చేసిన సేవలకు గుర్తింపునివ్వని పార్టీ, అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పీవీ నర్సింహారావు గారికి భారతరత్న పురస్కారంతో గౌరవించడం భారతజాతికే గర్వకారణం. తెలుగుజాతి ఆత్మగౌరవానికి గుర్తింపు దక్కినట్లుగా భావిస్తున్నామన్నారు. మనమంతా పీవీ స్ఫూర్తిగా ఆచరణలో పునరంకితం కావాలని కోరుతున్నానన్నారు.