NationalNews

“కాంతార మూవీ”తో భూతకోల నృత్యకారుల జీవితాల్లో వెలుగులు

కర్ణాటకలో విడుదలైన కాంతార మూవీ అక్కడ సూపర్‌ డూపర్ హిట్ అయ్యింది.దీంతో ఈ మూవీని తెలుగు,తమిళ్,హిందీ భాషలలో కూడా డబ్బింగ్ చేశారు. కాగా భాషతో సంబంధం లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కర్ణాటకలోని ఆదీవాసీ సంస్కృతిని ,సాంప్రదాయాన్ని ముఖ్యంగా భూతకోల నృత్యకారుల జీవన విధానాన్ని తెలిపే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ విడుదలైంది. అయితే దీంట్లో భూతకోల నృత్యకారులను తెరపై చూపించిన తీరు, ఆ పాత్రలో రిషబ్‌శెట్టి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్ధిక సాయం అందించనున్నట్లు  పేర్కొంది. కాగా రాష్ట్రంలో అర్హులైన భూతకోల నృత్యకారులకు నెలకు రూ.2000 అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని బెంగుళూరు సెంట్రల్ ఎంపీ పీసీ  మోహన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ ట్వీట్‌లో ఆయన బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం దైవారాధన,భూతకోల నృత్యం చేస్తున్న వారికి ప్రతి నెల రూ.2000 అలవెన్స్ అందిస్తుందని వెల్లడించారు. హిందు ధర్మాలలో భూతకోల నృత్యం ప్రత్యేక దైవారాధనగా ఉందని తెలిపారు. కాగా  వారిని ప్రోత్సహిస్తూ.. అలవెన్స్ ఇచ్చేందుకు అంగీకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి కృతజ్ఞతలు అని పీసీ మోహన్ ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయంతో ఆ రాష్ట్రంలోని భూతకోల నృత్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.