ఎంపీల జీతంపై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజకీయ నాయకుల వేతనాలపై ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రాజకీయాల్లో నిజాయితీగా పని చేసే ఎంపీలకు వేతనం సరిపోవడం లేదని అన్నారు. తమతో ఉండే సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమేనని అన్నారు. ప్రజాప్రతినిధులు, పీఏలతో కలిసి నియోజకవర్గాలకు వాహనాలలో వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశం కనీసం 300 నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంపీలకు వచ్చే వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే చాలామంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, కొందరు న్యాయవాద వృత్తిలో ఉండగా, ఇంకొందరు ఇతర వృత్తుల్లో ఉన్నట్లు చెప్పారు. ఎంపీగా ఉంటే మరో ఉద్యోగం అవసరం కాబట్టి ఆ పదవిని వృత్తిగా తీసుకోలేమని పేర్కొన్నారు.