కడప దర్గాకి ఖండాంతరాల ఖ్యాతి – ముషాయిరాలో రామ్ చరణ్
వాహ్ తాజ్ అంటూ ప్రపంచాన్ని సైతం మైమరిపించిన విశ్వవిఖ్యాత సంగీత విధ్వాంసులు,ఇళయరాజా శిష్యుడు అయిన ఏఆర్ రెహ్మాన్ ని సైతం ప్రభావితం చేసిన దర్గా కడపలోని అమీన్ పీర్ దర్గా.వాస్తవానికి ఈ దర్గాకి గడచిన 80 ఏళ్ల నుంచి ఉరుసు మహోత్సవాల పరంగా ఎంతో ఖ్యాతి ఉన్నప్పటికీ … సంగీత విధ్వాంసుడు ఏఆర్ రెహ్మాన్ ప్రతీ ఏటా దర్గా సందర్శనతో ఈ దర్గాకు భక్తుల తాకిడితో పాటు,ఖండాంతరాల ఖ్యాతి కూడా వచ్చింది. ప్రతీ ఏటా నిర్వహించే ఉరుసు మహోత్సవాలకు లక్షలాది మంది సాధారణ ప్రజలతో పాటు ప్రత్యేకంగా విమానాల్లో కడప విమానాశ్రయానికి చేరుకునే విదేశీ ప్రముఖులు కూడా వేలల్లో నే దర్గాని దర్శించుకుంటున్నారని చెప్పాలి.ఈ విషయంలో ఏఆర్ రెహ్మాన్ సరసన పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ చేరిపోయారు. అయ్యప్పమాలాధారణ చేసిన సినీ నటుడు రామ్ చరణ్ .. దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనేందుకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.అనంతరం దర్గా ప్రముఖులు రామ్ చరణ్ కి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 80వ ముషాయిరాలో పాల్గొని చాద్ సమర్పించారు. ముస్లిం పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నారు.దర్గా విశిష్టతను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు రామ్ చరణ్ తేజ. ఎంతో మహిమాన్విత క్షేత్రం అని ఎప్పుడైనా ఒకసారి తప్పక దర్శించాలని ఏఆర్ రెహ్మాన్ చెప్పడంతో ఇక్కడకు వచ్చానని రామ్ చరణ్ వెల్లడించారు. ఇక్కడ వచ్చాక కానీ ఈ దర్గ ఉరుసు వైభవం తెలియలేదన్నారు. ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం తనకి సంతోషం కలిగించిందని చెప్పారు.మొత్తం మీద కులాంతర వివాహాలు చేసుకోవడమే కాదు …మతాంతర జాతరలు,ఉత్సవాల్లో పాల్గొని తమ కుటుంబం భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటించే కుటుంబమని ,ఈ విషయంలో అంతా ఐకమత్యంతో సాగాలని పిలుపునిచ్చేలా అందరికీ సంకేతాలిచ్చారు. భారతీయులని సర్వజన సమ్మేళనంలో భాగస్వాములని చేయాలని చాటి చెప్పేలా రామ్ చరణ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో అభిమానులుతో పాటు అన్నీ మతాల వారు హర్షిస్తున్నారు.