జస్టిస్ యశ్వంత వర్మకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్
తన ఇంట్లో భారీ మొత్తంలో లెక్కలో లేని సొమ్ము బయటపడిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత వర్మకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. తనపై నిర్వహించిన అంతర్గత దర్యాప్తు నివేదికను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం సమయంలో భారీగా కోట్ల రూపాయల నోట్లకట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ కేసులో జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలని నాటి సీజీఐ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి, ప్రధానికి సిఫార్స్ చేశారు. జస్టిస్ వర్మ పక్షాన వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గా హాజరయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయంతో పార్లమెంట్లో ఆయనపై అభిశంసన చేపట్టేందుకు మార్గం సుగమమైంది. తాజాగా జస్టిస్ వర్మ పిటిషన్ పై జస్టిస్ దీపాంకర్ దత్తా, ఏజీ మాషితో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. అనంతరం జస్టిస్ వర్మ పిటిషన్ ను సమర్థించలేమని తేల్చిచెప్పింది. ఆయన అంతర్గత కమిటీ విచారణలో పాల్గొన్న తీరు, ఆ తర్వాత అసలు కమిటీ సామర్థ్యాన్ని ప్రశ్నించడాన్ని తాము పరిగణనలోకి తీసుకొన్నట్లు పేర్కొంది. ఆయన రిట్ పిటిషనే విచారణకు అనర్హమని తేల్చింది. నాటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన ఏర్పాటుచేసిన అంతర్గత కమిటీ ఒక్క ఫొటోలు, వీడియోల అప్లోడ్ విషయంలో తప్పించి.. మిగిలిన అంశాల్లో చట్టాన్ని పూర్తిగా అనుసరించారని తేల్చిచెప్పింది. ఇక ఫొటోలు, వీడియోల విషయాన్ని జస్టిస్ వర్మ పిటిషన్ అభ్యంతరం చెప్పకపోవడంతో దానిని పట్టించుకోమని బెంచ్ పేర్కొంది. ఇక అదే సమయంలో జస్టిస్ వర్మపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలంటూ న్యాయవాది మాథ్యూ దాఖలు చేసిన ఓ రిట్ పిటిషన్ ను కూడా కొట్టేసింది.