News AlertTelangana

జూనియర్ లైన్‌మెన్ పరీక్ష రద్దు.. త్వరలో కొత్త నోటిఫికేషన్

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో 1000 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్టు సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలో మరో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీకి గత జూలై 17న నిర్వహించిన రాత పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్వహించిన జూనియర్ లైన్‌మెన్ పరీక్ష అక్రమాల్లో ఇద్దరు ఏడీఈలు సహా ఐదుగురు ఉద్యోగుల పాత్ర వెలుగులోకి వచ్చింది. పలువురు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో వారికి సమాధానాలు చేరవేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కొందరు విద్యుత్‌ అధికారులు, సిబ్బందిని రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు విచారించి అరెస్టు చేశారు. మొత్తం 181 అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఇంకా చాలా మంది అభ్యర్థులకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉండే అవకాశాలున్నట్టు అధికారులు భావిస్తున్నారు.

కాగా, హైదరాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో ఉన్న సంస్థ కార్యాలయం ఎదుట పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కొంత మంది అభ్యర్థులు అప్పట్లో ధర్నాలు నిర్వహించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.

నోటిఫికేషన్‌ రద్దుపై అభ్యర్థుల్లో అసంతృప్తి
జూనియర్‌ లైన్‌మెన్‌రాత పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని తాము కోరితే ఏకంగా నోటిఫికేషన్‌ రద్దు చేయడం సరికాదని కొందరు జూనియర్‌ లైన్‌మెన్‌ అభ్యర్థులు మండిపడ్డారు. మళ్లీ కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేస్తే నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందని, మళ్లీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.