వందేళ్ల జీవితానికి జపాన్ ఆరోగ్య సూత్రాలు
ప్రపంచంలోనే శతాధిక వృద్ధులు అధికంగా ఉన్న దేశం జపాన్. వారి సగటు జీవిత కాలం 86 సంవత్సరాలు. వారు ఎక్కువకాలం జీవించడమే కాదు.. ఆనందంగా, ఆరోగ్యంగా కూడా జీవిస్తూ ఉంటారు. వారి సుఖమయ జీవితానికి సీక్రెట్ ఏంటనేది ప్రపంచ దేశాలకు పెద్ద ప్రశ్న. దీని గురించి వారి లైఫ్ స్టైల్ ను గమనిస్తే మనకు చాలా విషయాలు వెల్లడవుతాయి. వారు పాటించే ఆరోగ్య సూత్రాలు ప్రతీ దేశంలోని ప్రజలూ విధిగా పాటిస్తే వందేళ్ల పాటు జీవించడం చాలా సులభం.
. జపనీస్ లైఫ్ స్టైల్లో పరిశుభ్రత, డిసిప్లిన్, డైట్, ప్రకృతి.. ఇలా చాలా అంశాలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా జపనీయులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారు. వారు వ్యక్తిగత పరిశుభ్రత కూడా బాగా పాటిస్తారు. అక్కడి పరిశుభ్రతకు ఎంత పెద్ద పీట వేస్తారంటే.. ఏ షాపుకెళ్లినా డబ్బు వేయడానికి ఒక ట్రే ఉంటుంది. అందులోనే డబ్బు వేస్తారు. అందుకే కరెన్సీ నోట్లు కొత్తగా మెరిసిపోతుంటాయి.
జపాన్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణను అలవాటు చేస్తారు. చెప్పులు బయట వదిలడం అనేది జపనీస్ కచ్చితంగా ఫాలో అయ్యే రూల్. ఇంటికి వెళ్లినా, స్కూల్ కు వెళ్లినా.. చెప్పులు, షూస్ బయటే వదిలి లోపలికి వెళ్తారు. క్రమశిక్షణ వల్ల చక్కటి ఆరోగ్యం వారి సొంతమవుతోంది.
. జపానీయులు ఎక్కువకాలం బతకడానికి వాళ్లు తీసుకునే ఆహారమే కారణమని చెప్పొచ్చు. వాళ్లు ప్యాకేజ్డ్ ఫుడ్ తినడానికి అంతగా ఇష్టపడరు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వండిన ఆహారాన్నే తీసుకుంటారు. జపనీస్ ఎక్కువగా సీ ఫుడ్ తీసుకుంటారు. దానివల్ల వాళ్లో ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తక్కువ.
. జపాన్లో ఎవరైనా జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే వాళ్లు తప్పక మాస్క్లు పెట్టుకుంటారు. ఇతరులకు ఆ వైరస్, బ్యాక్టీరియా సోకకుండా చూడడం తమ బాధ్యతగా భావిస్తారు.
. వారి రోజువారీ సంప్రదాయ వంటకాల్లో సోయాబీన్ ఏదో ఒక రూపంలో ఉండాల్సిందే. కొవ్వుల శాతం అత్యల్పంగా ఉండే సోయాబీన్ వినియోగం వల్ల.. అక్కడి ప్రజల్లో ఊబకాయం అరుదు.
. వారు సమాజంతో మమేకం అవుతారు. ప్రజలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి.. ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకుంటూ జీవిస్తుంటారు. వీరుండే ప్రదేశాలను.. బ్లూ జోన్లుగా పిలుస్తారు. ఇక్కడ ఉండే వారు మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటివి లేకుండా హాయిగా జీవిస్తున్నారట.
. ఇక్కడి ప్రజలు.. చికిత్స కంటే నివారణే మేలు అనే రూల్ ను పాటిస్తారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ.. ఏ సమస్య వచ్చినా.. దానిని తొలిదశలోనే గుర్తించి.. వెంటనే చికిత్స తీసుకుంటారు.