Home Page SliderNational

జమిలి ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యం… తేల్చి చెప్పిన కేంద్రం

జమిలి ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో అసాధ్యమని తేల్చి చెప్పింది కేంద్రప్రభుత్వం. ఈ విషయంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ క్లారిటీ ఇచ్చారు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తారా? అని పలువురు ఎంపీలు పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చారు. ఈ ఏడాది, వచ్చే సంవత్సరాలలో పలు రాష్ట్రాలు, పార్లమెంటుకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ప్రశ్నను అడిగారు ఎంపీలు. దీనికి జవాబుగా జమిలి ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యమైన పని అని తెలియజేశారు. లాభాలు ఉన్నప్పటికీ, లోక్ సభకు, అసెంబ్లీలకు ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించాలంటే అనేక అడ్డంకులు ఉన్నాయన్నారు. దానికి కీలకమైన ఐదు రాజ్యాంగ సవరణలు చేయాలని, దీనికోసం అన్ని రాష్ట్రప్రభుత్వాలు, పార్టీలు అంగీకరించాలని పేర్కొన్నారు. అత్యధిక జనాభా, ఓటర్లు కలిగిన ఈ దేశంలో ఎన్నికల నిర్వహణకు పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు కావలసి ఉంటుందన్నారు. ఒకేసారి భద్రతా బలగాలను ఎన్నికల ప్రాంతాలలో మొహరించడం కూడా సాధ్యం కాదని తెలియజేశారు. తర్వాత కాలంలో చేపట్టవలసిన విధి విధానాల రూపకల్పన ప్రస్తుతం జాతీయ లా కమిషన్ పరిశీలిస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు.