నకిలీ జిలేబీ బాబాకు 14 ఏళ్లు జైలుశిక్ష
మనదేశంలో నకిలీబాబాలకు కొదవలేదు. ఎంతమంది నకిలీ అని తేలినా, మరో నకిలీ బాబా పుట్టుకొస్తూనే ఉన్నాడు. తాజాగా మరో నకిలీ బాబా మోసం బట్టబయలయ్యింది. హరియాణాలో ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మోసగాడు. అతని పేరు జిలేబీ బాబా. మహిమలు ఉన్నాయంటూ అమాయక మహిళలను నమ్మించి, వారికి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ అకృత్యాలను వీడియోలు తీసి, వారిని బ్లాక్‌మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అతని పాపం పండి న్యాయస్థానం అతనికి 14 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. ఫతేహాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతనిని దోషిగా నిరూపించి, జైలుశిక్షతో పాటు 35 వేల రూపాయలు జరిమానా కూడా విధించింది.

అతని అసలు పేరు అమర్‌వీర్. బిల్లూరామ్ అనే నిక్‌నేమ్ కూడా ఉంది. 18 ఏళ్ల వయసులోనే పంజాబ్ మాన్సా జిల్లా నుండి హర్యానాలోని ఫతేహాబాద్‌కు వలస వచ్చాడు. అక్కడ జిలేబీల వ్యాపారం చేయడంతో అతనికి జిలేబీ బాబా అనే పేరు వచ్చింది. తనకు తాంత్రిక విద్యలు వచ్చని, దెయ్యాలను వెళ్లగొడతానని ప్రజల్ని మోసం చేసేవాడు. 2018లో అతడి పరిచయస్థులలో ఒకామె, తనపై అత్యాచారం చేశాడని ఆరోపించడంతో అతనిపై విచారణ ప్రారంభం అయ్యింది. పోలీసులు, అతని ఫోన్‌లో మహిళలపై అఘాయిత్యం చేసిన వీడియోలను గుర్తించారు. అతని ఇంట్లో వీసీఆర్‌లు, బూడిద, మత్తు మందులు లభ్యమయ్యాయి. దాదాపు 120 వీడియోలు దొరికినట్లు విచారణలో తేలడంతో కోర్టు అతనికి ఈ శిక్షను ఖరారు చేసింది.