చంద్రబాబు ఇలాకాలో జగన్ సంక్షేమ గర్జన
కుప్పం నియోజకవర్గం నుంచి సమరశంఖం పూరించారు వైఎస్ జగన్… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు 175 సాధించి చరిత్ర సృష్టిస్తానంటున్న సీఎం జగన్ ఇప్పుడు నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతనిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి గర్జన మొదలుపెట్టారు. నవరత్నాలతో పేదలకు పలు పథకాలను చేరవేస్తున్న జగన్… వైఎస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ధిదారులకు డీబీటీ ద్వారా నిధులు విడుదల చేశారు. ఏపీలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఏటా 18,750 రూపాయల మేర సాయం చేసే పథకానికి జగన్ కుప్పం నుంచి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26.39 లక్షల మందికి, 4,949 కోట్ల రూపాయల నిధులను జగన్ విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఈ పథకంతో తాము చేసుకునే వ్యాపారాలను మరింత పరిపుష్టి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళల కోసం ప్రత్యేక పథాలను ప్రవేశపెట్టామని చెప్పిన సీఎం జగన్.. నాలుగు పథకాలతో మహిళలకు నేరుగా వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 51 వేల కోట్లు పంచామన్నారు. ఇక మొత్తంగా మహిళలకు మూడున్నరేళ్లలో లక్షా 17 వేల కోట్లు అందించామన్నారు. డైరెక్ట్‌గా ట్రాన్సఫర్ కాకుండా ప్రజలకు మూడేళ్లలో లక్షన్నర కోట్ల వరకు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ల కార్యక్రమం పూర్తయితే ఒక్కో మహిళకు పది లక్షల ఆస్తి సమకూరుతోందన్నారు. ప్రభుత్వంలో ఎక్కడా మధ్యవర్తులు, దళారులు లేరని… నేరుగా లబ్ధిదారుల ఎకౌంట్ల మనీ జమ చేస్తున్నామన్నారు. గతంలో చంద్రబాబునాయుడు సీంగా ఉన్న సమయంలో కంటే తామేమీ ఎక్కువ అప్పులు చేయడం లేదన్నారు జగన్. ఆయన పాలన… తన పాలనకు తేడా గమనించాలన్నారు.

కుప్పం నియోజకవర్గంలో గెలవడం తప్పించి అక్కడి ఓటర్లకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల్లో వెలుగులు పూయించామన్నారు. చంద్రబాబుకు హైదరాబాద్ లోకల్.. కుప్పం నాన్ లోకల్ అంటూ జగన్ ఎద్దేవా చేశారు. కుప్పంలోని వేల మంది యువత వలసలు వెళ్తుంటే చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. త్వరలోనే కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కప్పంలోని నాలుగు మండలాల అభివృద్ధికి వంద కోట్లు మంజూరు చేస్తామన్నారు జగన్. కుప్పం కరువుకు కారణమైన హంద్రీనావా ప్రాజెక్టు సైతం పూర్తి చేయని ఘనుడు చంద్రబాబు అన్నారు జగన్.


